పిల్లలకు ఎనీమియా పరీక్షలు చేయించాలి
ప్రజాశక్తి కాకినాడ
ఎనీమియా, బరువు తక్కువ ఉన్న పిల్లలు ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని తీసుకునే విధంగా తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని, రానున్న వారం రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలతో పాటు అన్ని సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న పిల్లలకు ఎనీమియా పరీక్షలు చేయించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులు ఆదేశించారు. గురువారం కాకినాడ కలెక్టరేట్ లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పురోగతిపై కలెక్టర్ కృతికా శుక్లా వైద్య ఆరోగ్యం, విద్యా, ప్రణాళిక, శిశు సంక్షేమం మహిళా అభివృద్ధి, డిఆర్‌డిఎ సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం, గిరిజన సంక్షేమ, ఇంటర్మీడియట్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చిన్నారులు, కిషోర బాలికలు, గర్భిణులు, బాలింతలలో రక్తహీనత లోపాన్ని అధిగమించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తుందన్నారు. ప్రధానంగా చిన్నారుల్లో ఎనీమియా, బరువు తక్కువ ఉన్న పిల్లలకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తినే విధంగా తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రానున్న వారం రోజుల్లో రెండవ దశ కింద ప్రభుత్వ పాఠశాలలతో పాటు అన్ని సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న చిన్నారులకు ఎనీమియా పరీక్షలు నిర్వహించాలన్నారు. గర్భిణులకు సక్రమంగా అన్ని పిహెచ్‌సిల్లో సక్రమంగా పరీక్షలు చేయించాలన్నారు. ప్రాముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాల వారీగా 0-5 వయసు కలిగిన చిన్నారు లకు ఆధార్ నమోదు చేయించాలని, ఇందుకు ప్రత్యేక ఆధార్ నమోదు క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సమావేశంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్ రమేష్, సిపిఒ పి.త్రినాథ్, సోషల్ వెల్ఫేర్ జెడి జెరంగలక్ష్మి దేవి, డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి, డిఐఒ డాక్టర్ ఐ. ప్రభాకర్, డివైఇఒ ఆర్‌జె డానియల్ రాజ్, నైపుణ్య శిక్షణాధికారి హాజరయ్యారు.
లక్ష్యానికి అనుగుణంగా సమగ్ర భూ సర్వే
రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో సమగ్ర భూ సర్వే ప్రక్రియ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి..రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి గురువారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కతికా శుక్లా, జెసి ఎస్.ఇలాక్కియా వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకానికి సంబంధించి సమగ్ర భూ సర్వే, జాతీయ రహదారులు, పర్యాటక ప్రాజెక్టులు, గహ నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ, స్పందన అర్జీల పరిష్కారం, వ్యవసాయం అనుబంధ రంగాలు, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన లేఅవుట్, గృహ నిర్మాణంలో పురోగతి, ఎస్.హెచ్.జీ రుణాలుబీ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ సంకల్పం, స్వామిత్వ ఇతర ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై సీఎస్ జవహర్ రెడ్డి, కలెక్టర్లతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్టోన్ ప్లాంటేషన్ పనులలో పురోగతి కనబరచాలని, వాతావరణం అనుకూలంగా ఉన్నందున గృహ నిర్మాణ పనులు చేపట్టడంతో పాటు స్టేజ్ కన్వర్జేషన్ జరిగేలా చూడాలని జగనన్న కాలనీలలో అవసర మైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేయాలన్నారు. సామూహిక గృహప్రవేశ ప్రారంభోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. ప్రభుత్వ శాశ్వత భవనాలు, గోదాములు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టరు తెలిపారు. వ్యవసాయ శాఖకు సంబంధించి కస్టమ్ హైరింగ్ సెంటర్ల గ్రౌండింగ్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ కతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఆర్‌ఒ కె.శ్రీధర్ రెడ్డి, జడ్‌పి సిఇఒ ఎన్.వి.వి. సత్యనారాయణ, సిపిఒ పి.త్రినాథ్, వ్యవసాయశాఖ జెడి ఎన్.విజరు కుమార్, పశుసంవర్ధక శాఖ జెడి డాక్టర్ ఎస్. సూర్యప్రకాశరావు, డ్వామా పీడీ ఎ.వెంకట లక్ష్మి, డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి, హౌసింగ్ పీడీ బి.సుధాకర్ పట్నాయక్, డిపిఒ ఆర్. విక్టర్, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా సూపరింటెండెంట్ ఇంజనీర్లు, కాకినాడ, పెద్దాపురం డిఎల్‌డిఒలు ఇతర అధికారులు పాల్గొన్నారు.
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ కృతికా శుక్లా










