
ప్రజాశక్తి - భీమవరం రూరల్
ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేసి నులి పురుగులను నిర్మూలిద్దామని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి పిలుపునిచ్చారు. నులి పురుగుల నివారణలో భాగంగా చెన్నరంగనిపాలెం ఉన్నత పాఠశాలలో గురువారం చిన్నారులకు స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలను కలెక్టర్ వేసి మాట్లాడారు. పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణలో భాగంగా ఏడాది నుండి 19 ఏళ్ల లోపు వారికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లావ్యాప్తంగా ప్రతీ ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలు, కళాశాలు, వివిధ వసతి గృహాల విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నా భూమి-నా దేశం, నేల తల్లికి వందనం, వీరులకు వందనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టరు పిలుపునిచ్చారు. విద్యార్థులతో కలెక్టరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతిస్తుందన్నారు. చదువు మధ్యలోనే మానేసి బడిబయట ఒక్కరు కూడా ఉండ కూడదని కలెక్టరు అన్నారు. చెన్నరంగనిపాలెం ఉన్నత పాఠశాలను కలెక్టరు ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలల రికార్డులను, కంప్యూటర్ డేటాను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.వెంకట రమణ, జిల్లా పంచాయతీశాఖ అధికారి జివికె.మల్లికార్జునరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డి.మహేశ్వరరావు, పురపాలక సంఘం కమిషనర్ ఎం.శ్యామల, వైద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎఎన్‌ఎంలు, వార్డు సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.