Sep 04,2023 21:12

సమావేశంలో మాట్లాడుతున్న డిఎంహెచ్‌ఒ జగన్నాధరావు

పార్వతీపురం : పిల్లల వ్యాధులపై అవగాహన పెంపొదించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.జగన్నాథరావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి అధ్యక్షతన పిల్లల వ్యాధులపై వైద్యాధికారులు, నర్సులకు 4డి వ్యాధులు, చికిత్స, రిఫరల్‌, శస్త్ర చికిత్సలు మొదలైన విషయాలపై 3 రోజుల శిక్షణ కార్యక్రమం స్థానిక ఐటిడిఎ గిరిమిత్ర మందిరంలో సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులకు సరైన అవగాహన లేక అశ్రద్ద చేసే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. పుట్టినప్పటి నుండి కనీసం ఐదేళ్ల వయస్సు వరకు పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టడం వల్ల జీవితంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు తక్కువగా ఉంటాయని అన్నారు. వైద్య సిబ్బంది సామాజిక సేవలో భాగంగా ఆరోగ్యవంతమైన జిల్లాగా రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పిల్లల నిపుణులు డాక్టర్‌ ఎల్‌.భరత్‌ చంద్ర పిల్లల ఆరోగ్యం - సంరక్షణపై వివరించారు. కార్యక్రమంలో ఆర్‌.బి.ఎస్‌.కె ప్రాజెక్ట్‌ అధికారి డా. ధవళ భాస్కరరావు, ఎఫ్డిపి ప్రోగ్రాం అధికారి డా.ఎమ్‌.వినోద్‌, ఎపిడియాలజిస్ట్‌ డా.ఎమ్‌ నవీన్‌, ఎస్‌.ఓ,, డెమో తదితరులు పాల్గొన్నారు.