Aug 24,2023 21:34

మాట్లాడుతున్న జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

* జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
పిల్లల ప్రవర్తనను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలని జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా అన్నారు. జిల్లా కోర్టులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యాన పలు శాఖల అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. చిన్నపిల్లల్లో మంచి ప్రవర్తన, సోదరభావం, దేశభక్తి చిన్నతనం నుంచే పెంపొందించే దిశగా కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. పిల్లల ప్రవర్తనను ఇంట్లో తల్లిదండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయులు అనుక్షణం గమనిస్తూ వారిలో చిన్న తేడా కనిపించినా వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే అవి పిల్లల ప్రవర్తనా లోపాలుగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. పిల్లల్లో సత్ప్రవర్తన పెంపొందించడానికి తగిన సూచనలు, సలహాలు అందజేయాలన్నారు. సమావేశంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు, జువైనల్‌ జస్టిస్‌ మెజిస్ట్రేట్‌ శారదాంబ, మొబైల్‌ మెజిస్ట్రేట్‌ శ్రీవిద్య, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన్‌ శ్రీలక్ష్మి, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ కె.వి రమణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.