ప్రజాశక్తి -భీమునిపట్నం పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో గొప్పదని ప్రముఖ మానసిక నిపుణులు డాక్టర్ జెట్లీ అన్నారు. బుధవారం స్థానిక తోటవీధి జివిఎంసి సామాజిక కేంద్రంలో పిల్లల పెంపకంలో నైపుణ్యాలు, తల్లిదండ్రుల పాత్ర అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్‌ఒఎస్ కుటుంబ బలోపేత కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సదస్సులో జెట్లీ మాట్లాడుతూ, పిల్లల్లో ఉన్న పొరపాట్లను ఎత్తిచూపి, కించపరిచే కన్నా, మంచిపనులు చేసేలా ప్రోత్సాహించాలన్నారు. పిల్లల ఎదుటనే తగాదాలు, అనవసర వివాదాలు లేకుండా ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తల్లి మాత్రమే సరైన శిక్షణ ద్వారా పిల్లలను మంచి మార్గం వైపు నడిపించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో కుటుంబ బలోపేత కార్య క్రమం ఇంఛార్జి కె దుర్గరాజు, సిబ్బంది పాల్గొన్నారు.










