పిల్లల కోసం కళా ప్రపంచాన్ని సృష్టిస్తూ... నేటి నుంచి తిరుపతి బాలోత్సవం
పిల్లల కోసం కళా ప్రపంచాన్ని సృష్టిస్తూ...
నేటి నుంచి తిరుపతి బాలోత్సవం
ప్రజాశక్తి-తిరుపతి సిటి
తిరుపతి బాలోత్సవం పిల్లల కోసం పని చేసే సృజనవేదిక. పిల్లల కోసం ఒక కళా ప్రపంచాన్ని సృష్టించాలన్న సత్సంకల్పం. బాలల సర్వతోముఖాభివృద్దే నిజమైన దేశాభివృద్ది. కలలను కళలుగా మార్చే కమనీయ చైతన్య సిరులు బాలలు. తమస్సునపు చీల్చి ఉషస్సును ప్రసాదించే దీప్తి మన బాలోత్సవం. బాలల నూతన చేతనకు నాంది పలుకుతూ... తిరుపతి బాలోత్సవం పిల్లల పండుగకు ఈ నెల 17, 18న తిరుపతి ఆతిథ్యం ఇవ్వనుంది. ఆరు నెలల క్రితం ఏర్పడిన తిరుపతి బాలోత్సవం జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహించింది. 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లాలో 155 స్కూళ్లలో పిల్లలకు పలు పోటీ కార్యక్రమాలను నిర్వహించింది. పిల్లల్లో విద్య పట్ల ఆసక్తిని పెంచుతూ సాంకేతిక అభివృద్దిని పెంచుతూ సమాజం పట్ల పిల్లలకు అవగాహన కల్పిస్తూ శాస్త్రీయ దృక్పథంతో ముందుకెళ్లేలా బాలోత్సవం కృషి చేయనుంది. రీజనల్ సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో నవంబరు 13, 14 తేదీలలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించి, 84 పాఠశాలల నుంచి ప్రదర్శనలు నిర్వహించారు. పలు పోటీలలో విజేతలకు నిలిచిన విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. తిరుపతిలో ప్రపథమంగా ఈ నెల 17, 18న తిరుపతి నెహ్రు మున్సిపాల్ హైస్కూల్‌లో నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారు. ఈ కార్యక్రమంలో 30 అకడమిక్ 10 సాంస్కృతిక విభాగాల్లో మొత్తం 40 ఈవెంట్లు జరగనున్నాయి. ఇందులో ప్రభుత్వ, నగర పాలిక, టిటిడి, ప్రయివేట్, అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొననున్నారు.
నియమ నిబంధనలు
-అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చు.
-పోటీల్లో పాల్గొన్న ప్రతివిద్యార్ధికి ప్రత్యేమైన కోడ్ నెంబరు ఇవ్వబడును.
-ప్రతి విభాగంలోనూ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయి. -పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్ధికి సర్టిపికెట్ ఇవ్వబడును.










