ప్రజాశక్తి-లీగల్ విలేకరి : పిల్లల భవిష్యత్తు వారధుల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు నిలవాలని విశాఖపట్నం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.హరిహరనాథశర్మ పేర్కొన్నారు. జిల్లా కోర్టులోని ఆయన ఛాంబర్‌లో ఇటీవల రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యునిగా నియమితులైన గొండు సీతారాం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరిహరనాధ శర్మ మాట్లాడుతూ, బాలల హక్కులు, చట్టాలపై కమిషన్ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, చట్ట ప్రకారం దత్తత, బాలల సంక్షేమంపై నిర్విరామ కృషి చేయాలన్నారు. పిల్లలు అందించే ప్రతి ఫిర్యాదునూ జాగరూకతతో పరిశీలించి వారికి శత శాతం న్యాయం జరిగేలా చూడాలని చెప్పారు. ఫిర్యాదుల స్వీకరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ప్రచారం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె.జగ్గారావు, ఎం.చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు.










