Jan 20,2023 22:36

కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌
ప్రజాశక్తి - ఏలూరు

              తల్లిదండ్రుల ప్రేమ, కుటుంబ వాతావరణంలో ఉంటేనే పిల్లలు చక్కని బాధ్యత గల పౌరులుగా తయారవుతారని, దీనికోసం అనాధ పిల్లల దత్తతను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారు. సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ, అడాప్షన్‌ రెగ్యులేషన్‌-2022 ప్రకారం ఏలూరు శిశుగృహలో ఆశ్రయం పొందిన చిన్నారి బేబీ స్నేహితను చిత్తూరు జిల్లాకు చెందిన దత్తత అర్జీదారులు పి.అనిల్‌కుమార్‌, శ్రీవిద్య దంపతులకు శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌, జిల్లా దత్తత అధికారి వారి ద్వారా దత్తత ఇచ్చారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ మాట్లాడుతూ పిల్లలు లేని తల్లిదండ్రులు చట్టప్రకారం కారా నియమ నిబంధనలు పాటించి దత్తత పొందా లన్నారు. పిల్లల భవిష్యత్‌ను చక్కగా తీర్చిదిద్దే బాధ్యత సమాజంలో ప్రతిఒక్కరిపై ఉందన్నారు. దత్తత పొందాలనే తల్లిదండ్రులు జిల్లా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశుగృహ సిబ్బందిని సంప్రదిం చాలన్నారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశుసంక్షేమాధికారి కె.పద్మావతి, డిసిపిఒ సిహెచ్‌. సూర్యచక్రవేణి, బాలల రక్షణాధికారి ఆర్‌.రాజేష్‌, సోషల్‌ వర్కర్‌ సుజనమ్మ పాల్గొన్నారు.