
ప్రస్తుతం దేశంలో అమలు జరుగుతున్న కార్పొరేట్ అనుకూల విధానాల చట్రం పరిధిలోనే ఈ ''జన్ సురాజ్'' ఉండబోతుందా? లేక నయా ఉదారవాద విధానాల చట్రాన్నే పి.కె వ్యతిరేకించి నిలబడతాడా? అన్నది ఒక కీలక ప్రశ్న. గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలేరుకునే చందంగా నయా ఉదారవాద విధానాలను వ్యతిరేకించకుండా కేవలం మంచి పరిపాలనతో ప్రజల స్థితిగతులను మార్చేస్తానని పి.కె భావిస్తే అంతకన్నా వెర్రితనం మరొకటి ఉండదు.
''లాభం లేదు..నేనిక ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాల్సిందే...'' అని ఈ మధ్యనే ప్రకటించారు పి.కె - అదే, ప్రశాంత్ కిశోర్.
''గత పదేళ్ళుగా ఇక్కడ ప్రజాస్వామ్య ప్రక్రియలో అర్ధవంతమైన భాగస్వామిగా వ్యవహరించడానికి, ప్రజలకు అనుకూలంగా విధానాలు రూపొందేందుకు తోడ్పడడానికి ప్రయత్నించాను. ఎన్నో ఎగుడుదిగుడులను చూశాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నాక 'అసలు యజమానులైన' ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలను మరింత బాగా అర్ధం చేసుకుని 'ప్రజా సుపరిపాలన' సాధించే దారి కనుగొంటాను'' - ఇటీవల పి.కె ట్విటర్ లో పెట్టిన పోస్టు ఇది. తన స్వంత రాష్ట్రమైన బీహార్ లో తన ప్రయత్నాన్ని ప్రారంభించనున్నట్టు సూచనప్రాయంగా తెలియజేశాడు.
ఇంతకు కొద్ది రోజులముందు పి.కె కాంగ్రెస్ పార్టీలో చేరి ఒక ముఖ్య భూమిక పోషించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ విధంగా చేయబోవడం లేదని కూడా వార్తలు వచ్చాయి.
తాజా ట్వీట్ తో పి.కె కొత్త ఊహాగానాలకు తెర లేపాడు. బీహార్‌నే పి.కె ఎందుకు ఎంచుకున్నాడన్న ప్రశ్నకు సమాధానంగా ఓ వార్తాపత్రికలో ఒక విశ్లేషకుడు ఈ విధంగా వివరణ ఇచ్చాడు. ''బీహార్ లో ప్రజలు ప్రత్యామ్నాయం కావాలని గట్టిగా కోరుకుంటున్నారు. ప్రస్తుతం రాజకీయంగా బలాబలాలు చూసుకుంటే బిజెపికి 35 శాతం, ఆర్‌జెడి కి 35 శాతం, జె.డి (యు) కి 15 శాతం ఓటింగ్ ఉంది. కాంగ్రెస్, వామపక్షాలు, తక్కిన చిన్న పార్టీలు అన్నీ కలిపి కొరవ 15 శాతం వోటింగ్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఏ ఒక్క పార్టీ కూడా స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం మీద ప్రజల్లో అసంతృప్తి బలంగా ఉన్న నేపథ్యంలో కొత్త కలయికలకు అవకాశాలు బాగా ఉన్నాయి. పి.కె. తన గతానుభవాన్ని, ఇక్కడ ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఏర్పడబోయే కొత్త కలయికలో ఒక కీలక పాత్ర పోషించడానికి ప్రయత్నిస్తున్నాడు.''
బీహార్ లోనే గాక, దేశంలోని వివిధ రాష్ట్రాల ఎన్నికల సందర్భాలలో పోషించిన వ్యూహాత్మక పాత్ర దృష్ట్యా, పి.కె చర్చనీయాంశంగానే ఉన్నాడు.
1977లో బీహార్ లోని షాహాబాద్ జిల్లాలో జన్మించిన పి.కె వయస్సు ఇప్పుడు 45 సంవత్సరాలు. ప్రజారోగ్యంలో ఒక నిపుణుడిగా శిక్షణ పొంది ఎనిమిది సంవత్సరాలపాటు ఐరాసతో పని చేశాడు. ఆ తర్వాత బిజెపికి ఎన్నికల వ్యూహ రచనలో, ఎత్తుగడల రూపకల్పనలో సహకరించడంతో తన రాజకీయ జోక్యం ప్రారంభమైంది.
ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనకుండా నియోజకవర్గాలలో వాస్తవ పరిస్థితులను క్షుణ్ణంగా తన బృందాలతో అధ్యయనం చేయడం, ఆ తర్వాత ఎన్నికలలో గెలుపు సాధించేందుకు నియోజకవర్గం వారీగా వ్యూహాన్ని రూపొందించి తనను నియమించుకున్న రాజకీయ పార్టీ ప్రధాన నేతకు నేరుగా ఆ వ్యూహాన్ని నివేదించడం- ఇదీ పి.కె వ్యవహారశైలి. ప్రజలు ఏ విషయాల గురించి ఏమనుకుంటున్నారో, ఏ నాయకుల గురించి, ఏ పార్టీల గురించి ఏమనుకుంటున్నారో ఏ యే అంశాలు ఓటర్లను ప్రభావితం చేయబోతున్నాయో వివిధ దశల్లో సర్వే చేసి ఆ సర్వే ను బట్టి వ్యూహాన్ని రూపొందిస్తాడు. పార్టీల నిర్మాణ పరిస్థితి, కులాల సమీకరణలు, ప్రజల సెంటిమెంట్లు, వివిధ ప్రచారాల ప్రభావాలు, డబ్బు పోషించబోయే పాత్ర వంటివి అన్నీ పరిగణన లోకి తీసుకుంటాడు. గెలుపుగుర్రాలుగా ఏ క్యాండిడేట్లు నిలబడగలుగుతారో కూడా అంచనా వేస్తాడు. వందలాదిమంది కార్యకర్తలను రంగంలోకి దించుతాడు. వారంతా తామెవరన్నదీ బైట పడకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి పి.కె కి నేరుగా నివేదిస్తూంటారు.
ఈ పని అంతా చేసిపెట్టినందుకు తనను పనిలో పెట్టుకున్న రాజకీయ పార్టీ నుండి, లేదా, నాయకుడి నుండి భారీగా డబ్బు తీసుకుంటాడు. అంటే ఎన్నికల ప్రక్రియను విధానాలతో, విలువలతో నిమిత్తం లేని ఒక వ్యాపార నిర్వహణా వ్యవహారంగా మార్చివేయడంలో పి.కె ముఖ్య పాత్ర పోషించాడు. ఎన్నికలలో తీర్పునివ్వాల్సింది వోటర్లు. ఆ వోటర్ల తీర్పును ఆ యా పార్టీల, అభ్యర్ధుల మంచి చెడ్డలు, పాలసీలు ప్రభావితం చేయాలి. ప్రజల తీర్పును బట్టి ప్రభుత్వాలు ఏర్పడాలి. ప్రజలు స్వేచ్ఛగా తమ తీర్పును ఇవ్వగల వాతావరణం ఉండాలి. కాని పాలక పార్టీలు డబ్బు, మద్యం, గూండాగిరీ, అధికార దుర్వినియోగం, తప్పుడు ప్రచారం వంటివి ఎన్నికల్లో ప్రయోగించడం 1952 నుంచీ జరుగుతూనే వుంది. ఇప్పుడు పి.కె మరో అడుగు ముందుకేసి ఏకంగా ఎన్నికల కన్సల్టెంట్ అవతారం ఎత్తాడు. ఎన్నికలలో ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు మేలు ఎక్కువ జరుగుతుంది అన్నదానితో ఈ కన్సల్టెంట్ కి సంబంధం లేదు. తనను నియమించిన పార్టీని గెలిపించే వ్యూహం రూపొందించడమే అతని పని. ఆ వ్యూహం పర్యవసానంగా ప్రజలు రాబోయే కాలంలో ఎటువంటి ఫలితాలను అనుభవిస్తారన్నది అతనికి సంబంధంలేని విషయం. అన్నీ వ్యాపారమయమైపోయిన ప్రస్తుత నయా ఉదారవాద సమాజంలో ఎన్నికల వ్యూహాలను, ఎత్తుగడలను ఒక వ్యాపార సరుకుగా మార్చాడు పి.కె.
కేంద్రంలో అధికారం తమ చేతిలోకి రావడం, కార్పొరేట్ల నుండి అన్ని విధాలా పూర్తి అండదండలు ఉండడం, రాజ్యాంగ వ్యవస్థలోని అన్ని అంగాలలోకీ తమ మనుషులను ప్రవేశపెట్టడం ద్వారా వాటిని తమ పార్టీకి అనుకూలంగా ఉపయోగించుకోగలగడం జరిగిన తర్వాత బిజెపి కి వేరే వ్యూహం అవసరం లేకపోయింది. అదే సమయంలో పి.కె కూడా బిజెపి మతోన్మాద ఎజెండా నుండి తనను తాను విడగొట్టుకున్నాడు. కొన్నాళ్ళు నితీష్ కుమార్ తో కలిసి జెడి(యు) లో ముఖ్య వ్యూహకర్తగా వ్యవహరించాడు. 2020లో జెడి(యు) సిఎఎ చట్ట సవరణకు మద్దతు ఇచ్చినప్పుడు పి.కె తీవ్రంగా విమర్శించాడు. దాంతో జె.డి(యు) అతడిని బహిష్కరించింది. లౌకిక విలువల వైపు ఆ మేరకు పి.కె నిలబడ్డాడని చెప్పవచ్చు.
పి.కె గత పదేళ్ళలో పలు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేశాడు. తృణమూల్ కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపి వంటి పార్టీలు అతనిని సలహాదారుగా పెట్టుకున్నాయి. ఆప్ పార్టీకి కూడా తోడ్పడ్డాడు. తాజాగా కెసిఆర్ అతడి సేవలను వాడుకోవాలని భావించాడు. ఈలోపే కాంగ్రెస్ పార్టీ పి.కె తో చర్చిస్తోందన్న వార్తలు వచ్చాయి. ఇది కెసిఆర్ కు ఆశాభంగం కలిగించింది. ఐతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పి.కె చేరడం లేదన్న వార్త వెలువడ్డాకు కెసిఆర్ ఊపిరి పీల్చుకున్నాడు. తన హర్షాన్ని బహిరంగంగానే ప్రకటించాడు.
బిజెపి, జెడి(యు), టిఎంసి, వైఎస్‌ఆర్‌సిపి ని, ఆప్ - ఇలా ఏ పార్టీ తనను పనిలో పెట్టుకుంటే ఆ పార్టీ విజయానికి వ్యూహాన్ని రూపొందించడం పనిగా పెట్టుకున్నాడు పి.కె.
అయితే పి.కె ను కన్సల్టెంట్ గా పెట్టుకుంటే చాలు గెలిచిపోతాం అని ఎవరైనా అనుకుంటే అంతకన్నా పొరపాటు ఉండదు. గెలిచే పరిస్థితి ఉన్న పార్టీలకి అతని సలహాలు తోడ్పడ్డాయేమో గాని తన ఎన్నికల వ్యూహంతోటే ఫలితాలను తారుమారు చేయగలిగాడన్న నిర్ధారణకి ఎవరూ రాలేరు.
ఇప్పుడు పి.కె ప్రత్యక్ష రాజకీయాలలోకి దిగుతానని అంటున్నాడు. మంచిదే. ప్రజలే నిజమైన యజమానులు అన్నాడు అదీ మంచిదే. వ్యూహాలతో, ఎత్తుగడలతో ఎన్నికల్లో తిమ్మిని బమ్మి చేయడం గాకుండా ప్రజల్ని అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తానని అన్నాడు. అదీ మంచిదే. ''జన్ సురాజ్'' నినాదం ఇచ్చాడు. అది కేవలం ఒక ఆకర్షణీయమైన నినాదం మాత్రమేనా లేక దాని వెనుక ఏదైనా ఒక విధానం అంటూ ఉన్నదా అన్నదే ఇప్పుడు కీలకం.
ప్రస్తుతం దేశంలో అమలు జరుగుతున్న కార్పొరేట్ అనుకూల విధానాల చట్రం పరిధిలోనే ఈ ''జన్ సురాజ్'' ఉండబోతుందా? లేక నయా ఉదారవాద విధానాల చట్రాన్నే పి.కె వ్యతిరేకించి నిలబడతాడా? అన్నది ఒక కీలక ప్రశ్న. గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలేరుకునే చందంగా నయా ఉదారవాద విధానాలను వ్యతిరేకించకుండా కేవలం మంచి పరిపాలనతో ప్రజల స్థితిగతులను మార్చేస్తానని పి.కె భావిస్తే అంతకన్నా వెర్రితనం మరొకటి ఉండదు. మన రాష్ట్రంలో కూడా జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాను కనుక నయా ఉదారవాద విధానాలను ఎంత వేగంగా, ఎంత లోతుగా అమలు చేసినా ఫరవా లేదని భావిస్తోంది. అందుకే ప్రజల ఇక్కట్లూ పెరుగుతున్నాయి, వారి నుండి వ్యతిరేకతా పెరుగుతోంది. కనుక నేటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీకి సామాన్య ప్రజానీకం పట్ల నిబద్ధత ఉందా లేదా అన్న ప్రశ్నకు లిట్మస్ టెస్ట్ ఏమిటంటే ఆ పార్టీ నయా ఉదారవాద విధాన చట్రాన్ని ఆమోదిస్తున్నదా లేక వ్యతిరేకిస్తున్నదా అన్నదే.
ఇక రెండోది, ప్రధానమైనది లౌకిక విధానం పాటించడం. పి.కె సిఎఎ విషయంలో జె.డి (యు) తో విడగొట్టుకున్నాడు. అది స్వాగతించదగ్గ విషయమే. కాని మొత్తంగా అన్నివైపులా కమ్ముకొస్తున్న హిందూత్వ-కార్పొరేట్ శక్తుల బూటకపు జాతీయవాదం విషయంలో, మతోన్మాద చర్యల విషయంలో పి.కె స్పష్టమైన వైఖరి తీసుకోగలుగుతాడా?
పి.కె తన తాజా ట్వీట్ లో వెల్లడించిన ఆకాంక్ష వెనుక, జన్ సురాజ్ నినాదం వెనుక ఎంత నిజాయితీ, నిబద్ధత ఉన్నాయన్నది ఈ రెండు అంశాలను బట్టే తేలగలదు.
సుబ్రమణ్యం