Apr 24,2022 06:40
  • ఆ పార్టీ అధ్యక్ష ఎన్నిక దగ్గర నుంచి అంతా అయోమయంగా వుండటం దేశమంతా చూసింది. ఐక్యత అసలే లేదు. బిజెపి మతతత్వాన్ని గట్టిగా ఎదుర్కొనేబదులు మెతక హిందూత్వ ఫార్ములాను కాంగ్రెస్‌ అనుసరిస్తున్నది. ఇలాంటి తరుణంలో పి.కె చేయగలిగిందేమిటన్నది పెద్ద ప్రశ్న. ఆయన చెప్పే చిట్కాలలోనూ రాజకీయ విధానపరమైన అంశాలు అసలు లేకపోవడం గమనించదగింది. ప్రజాస్వామ్యం, లౌకికతత్వం వంటివి ఆయన ఊహల్లోనే వున్నట్టు కనిపించదు. పరస్పర వ్యతిరేకమైన పార్టీలను గెలిపించేందుకు సిద్ధమయ్యే ఒక మార్కెట్‌ ప్రచారకుడు రాజకీయంగా ఎలాంటి మార్గం చూపించగలరనేది పెద్ద ప్రశ్న. ఒక వస్తువు అమ్మకం లాగే పార్టీల మార్కెటింగ్‌ ఇంత వైరుధ్యభరితమైన దేశంలో ఏ మేరకు చెల్లుబాటవుతుంది? కాంగ్రెస్‌ను ఎలా గట్టెక్కిస్తుంది?


ఎన్నికల వ్యూహకర్త లేదా రాజకీయ మార్కెట్‌ వీరుడు ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌తో కలసి పనిచేస్తారా, ఆ పార్టీలో ప్రవేశిస్తారా...అది నాయకుడుగానా లేక సహాయదారుడుగానా తదితర ప్రశ్నలు, చర్చలు, వార్తలు హోరెత్తిస్తున్నాయి. పి.కె గా పిలవబడే ప్రశాంత్‌ కిశోర్‌ సోనియా సహా గాంధీలతో సమావేశమైనారనీ, ముఖ్య నాయకులతో మాట్లాడారనీ ఎప్పటికప్పుడు ఏవో కథనాలు. ఆ పైన ఆయన ఒక పిపిపి (పవర్‌ పాయింట్‌ ప్రెజంటేషన్‌) ఇచ్చారని, 800 సైడ్లతో కాంగ్రెస్‌కు గత భవిష్యత్‌ దృశ్యాలను చూపించారని మరో వార్త. వీటన్నిటిలోనూ ఆయన కాంగ్రెస్‌ గత వైభవాన్ని గుర్తు చేస్తూ అదంతా ఎందుకు ఎలా దెబ్బతినిపోయిందో చెప్పారట. మళ్లీ తెచ్చుకోవాలంటే ఏం చేయాలో ప్రణాళిక ఇచ్చారట. దీర్ఘకాలం అధికారంలో వుండటం వల్ల వచ్చిన యాంటీ ఇంకంబెన్సీ, విజయాలను చెప్పుకోలేకపోవడం, నాలుగు సార్లు వచ్చిన వ్యతిరేక ఉద్యమాలు ( జె.పి, బోఫోర్స్‌, మండల్‌, మందిర్‌ ) ఇందుకు కారణమని నిర్థారించారట. దీనికి విరుగుడుగా నాలుగు ఎంలు-మెసేజ్‌ మెసెంజర్‌, మెషినరీ, మెకానిక్స్‌ మార్చాలని చెప్పారట. దీన్ని అధ్యయనం చేసేందుకు అధ్యక్షురాలు సోనియా గాంధీ హేమాహేమీలతో కమిటీని వేస్తే వారిలో కొందరు పెదవి విరిచారట. గత ఎన్నికల ఓటమి తర్వాత తాను ఇచ్చిన సమీక్షా నివేదికలో అంశాలే ఇందులో చాలా వున్నాయని ఎ.కె. ఆంటోనీ అంటే 2007లో పంచమర్హి చింతనా శిబిరం తర్వాత అనుకున్న విషయాలు ఇలానే వున్నాయని మరొకరు పెదవి విరిచారట. అసలు కొత్తగా ఏ ప్రణాళికా ఇవ్వలేదనీ ఇది గత ఏడాది ఇచ్చిందేనని మరో వివరణ. ఏదేమైనా కాంగ్రెస్‌ అధికారికంగానే ఈ విషయాలు లీక్‌ చేసిందనేది స్పష్టం. మరోవంక ప్రశాంత్‌ కిశోర్‌తో సహా ఆయన బృందం కూడా ఇందుకు తగినట్టే ఎప్పటికప్పుడు మీడియాకు విషయాలు చేరవేస్తున్నది.

  • కాంగ్రెస్‌ దురవస్థ

వందేళ్ళ పైన చరిత్ర, సుదీర్ఘ కాలం పాలించిన వారసత్వం ఇలాంటి ఎన్నో ఘనతలు చెప్పుకునే కాంగ్రెస్‌ ఒక మార్కెట్‌ ప్రచారకర్తపై ఆధారపడవలసి వచ్చిందంటేనే ప్రస్తుత దుస్థితి వెల్లడవుతుంది. నిజానికి ఎమర్జన్సీ కారణంగా ఓడిపోయిన ఇందిరాగాంధీ 1980లో తిరిగిరావడం కోసం మొదటిసారిగా మార్కెటింగ్‌ ఏజన్సీని ఎన్నుకున్నారు. పని చేసే ప్రభుత్వం ( గవర్నమెంట్‌ దట్‌ వర్క్స్‌ ) అన్న నినాదంతో మళ్లీ వచ్చారు. ఇందిర హత్యానంతరం 1984లో రాజీవ్‌గాంధీ కూడా అదే బాటలో నడిచారు. 1989లో ప్రతిపక్షాలను పాములు, తేళ్ల లాగా చూపించే యాడ్స్‌తో పత్రికలు నింపేసినా కాంగ్రెస్‌ ఓడిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికలలోనూ యాడ్‌ ఏజన్సీలను, మార్కెటింగ్‌ ఏజన్సీలను కాంగ్రెస్‌ ఉపయోగిస్తూనే వుంది. ఇక బిజెపి కూడా వాజ్‌పేయిని 'ద మ్యాన్‌ ఇండియా అవైట్స్‌' అని ప్రచారం చేసుకుంది. తర్వాత 'ఫీల్‌ గుడ్‌ ఇండియా' నినాదంతో మట్టిగరచింది. మళ్లీ మోడీని త్రీడీలో చూపించేందుకు ఇదే ప్రశాంత్‌ కిశోర్‌ ఐప్యాక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి ఆయన చాలా ప్రాంతీయ, జాతీయ పార్టీలకు పనిచేశారు. బీహార్‌లో నితీశ్‌ కుమార్‌, ఎ.పి లో జగన్‌, తమిళనాడులో స్టాలిన్‌, ఢిల్లీలో కేజ్రీవాల్‌, బెంగాల్‌లో మమతా బెనర్జీ, యు.పి లో పంజాబ్‌లో కాంగ్రెస్‌...ఇలా పలువురు ఆయన సేవలను ఉపయోగించుకున్నారు. వీటిలో యు.పి తప్ప మిగిలిన అన్ని చోట్లా పి.కె బలపర్చిన వారు ఘన విజయాలు సాధించడంతో ఆయనకు బాగా హైప్‌ వచ్చింది. బిజెపి కి వ్యతిరేకంగా ఏదైనా జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం కుదిరే పని కాదని పి.కె గట్టిగా భావిస్తున్నారు. అలాగే అతుకుల బొంత లాంటి ప్రతిపక్ష ఐక్యత సాధ్యమయ్యేది కాదని కూడా ఆయన మాట. కాంగ్రెస్‌ వేగంగా బలహీనపడిపోయిందని 2019లో కేవలం 20 శాతం ఓట్లకు, 50 సీట్లకు పరిమితమైందని అంటూనే దాన్ని ఎలా బాగుచేయాలో చెప్పడం తన పని కాదంటారు. అలా అని బిజెపి కి తిరుగు లేదా అంటే అదీ ఒప్పుకోవడంలేదు. దేశంలో 200 లోక్‌సభ స్థానాలున్న దక్షిణాదిలో, తూర్పు భారత్‌లో బిజెపి నలభై కూడా తెచ్చుకోలేకపోయింది. 340 స్థానాలున్న ఉత్తరాదిలోనే దానికి అత్యధిక స్థానాలు వచ్చాయి. మరి ఈ 200 స్థానాలలో ప్రతిపక్షాలు కలసి వ్యవహరించి 150 పైన పొందగలిగితే బిజెపిని బలంగా సవాలు చేయడం సాధ్యమేనంటారు.

  • పి.కె మల్లగుల్లాలు - మాట మార్పులు

దేశంలో ఇప్పటివరకూ ఎనిమిదిసార్లు పార్టీలకు వ్యూహకర్తగా పని చేసి ఏడు సార్లు ఘన విజయాలు అందించిన పి.కె అందుకు పెద్ద వ్యూహాలు ఏమీ అనుసరించడం లేదన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం, సాధికారత కల్పించడం, సమస్యలపై వారి ఫిర్యాదులు వినడం ఇదే విజయానికి దారితీస్తుంటుంది. డ్రైనేజీ సమస్యల వంటివి పరిష్కరించడం చాలా సార్లు కీలక ప్రభావం చూపిస్తుందంటారు. పశ్చిమ బెంగాల్‌లో మొన్నటి ఎన్నికల్లో తృణమూల్‌ తరపున పని చేసిన పి.కె ఒక ప్రజల ఫిర్యాదులు వినేందుకు ఒక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేస్తే 70 లక్షల ఫోన్లు వచ్చాయట. వీటిలో అధికభాగం స్థానిక సమస్యలు, కల సర్టిఫికెట్ల జారీలో జాప్యం వంటి వాటిి గురించే కావడం విశేషం. ఆ దెబ్బతో ఆరు వారాలలో 26 లక్షల సర్టిఫికెట్లు అందేలా చేశారట. బహిరంగ సభలూ భారీ సమీకరణలూ ఎన్నికల విజయాలకు పెద్దగా దోహదం చేసేది లేదని ఆయన చెబుతారు. ఓటర్ల గురించి తానెప్పుడూ మరో ఊహ చేయనని, వారి నుంచి రాబట్టే కొత్త సమాచారం కొత్త ఐడియాలు ఇస్తుందని అంటారు పి.కె. తన వరకూ వృత్తిపరంగా తప్ప వ్యక్తిగతంగా రాజకీయాలపై పెద్ద ఆసక్తి లేదని చెబుతూ వచ్చిన పి.కె బెంగాల్‌ ఫలితాల తర్వాత మాత్రం తన పాత్ర మారుతుందని ప్రకటించారు. ఇదివరలో జెడియు లో చేరి ఇమడలేక బయిటకు వచ్చిన ఆయన కాంగ్రెస్‌లో చేరడం గురించే మాట్లాడ్డం మొదలెట్టారు. 200 లోక్‌సభ స్థానాల్లో బిజెపిని ఎదుర్కోవడానికి ఆ పార్టీ తప్ప మరెవరూ లేరన్నది ఆయన అంచనా. గత రెండు ఎన్నికల్లోనూ ఈ స్థానాలలో 90 శాతంపైనే బిజెపి గెలవగలిగిందని కూడా ఇక్కడ చెప్పాలి. కాంగ్రెస్‌ పాలించే రాష్ట్రాలు కూడా బాగా తగ్గిపోయాయి. ప్రతి చోటా అంతర్గత కలహాలు దాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పి.కె ఏదో కాయకల్ప చికిత్సతో కాంగ్రెస్‌ను గెలిపిస్తారనుకోవడానికి ఆధారమేమీ లేదు. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నిక దగ్గర నుంచి అంతా అయోమయంగా వుండటం దేశమంతా చూసింది. ఐక్యత అసలే లేదు. బిజెపి మతతత్వాన్ని గట్టిగా ఎదుర్కొనేబదులు మెతక హిందూత్వ ఫార్ములాను కాంగ్రెస్‌ అనుసరిస్తున్నది. ఇలాంటి తరుణంలో పి.కె చేయగలిగిందేమిటన్నది పెద్ద ప్రశ్న. ఆయన చెప్పే చిట్కాలలోనూ రాజకీయ విధానపరమైన అంశాలు అసలు లేకపోవడం గమనించదగింది. ప్రజాస్వామ్యం, లౌకికతత్వం వంటివి ఆయన ఊహల్లోనే వున్నట్టు కనిపించదు. పరస్పర వ్యతిరేకమైన పార్టీలను గెలిపించేందుకు సిద్ధమయ్యే ఒక మార్కెట్‌ ప్రచారకుడు రాజకీయంగా ఎలాంటి మార్గం చూపించగలరనేది పెద్ద ప్రశ్న. ఒక వస్తువు అమ్మకం లాగే పార్టీల మార్కెటింగ్‌ ఇంత వైరుధ్యభరితమైన దేశంలో ఏ మేరకు చెల్లుబాటవుతుంది? కాంగ్రెస్‌ను ఎలా గట్టెక్కిస్తుంది?

  • రాజకీయ ప్రశ్నలెన్నో!

ఇదంతా ఒక ఎత్తయితే పి.కె రాకపై కాంగ్రెస్‌ చేస్తున్న హడావుడి, భిన్న కథనాలు మరింత విడ్డూరంగా వున్నాయి. అసలు ఆయన రావద్దని ఇద్దరు నాయకులు వాదిస్తున్నారు. వస్తే పార్టీలోకి రావాలి గాని బయిట నుంచి పని చేస్తే కుదరదని మరో పల్లవి. సలహాదారుడుగా రావాలి తప్ప నాయకత్వం ఎలా ఇస్తామని ఇంకొందరి ఆక్షేపణ. దీన్నే వారు ప్యారాచూటింగ్‌ అంటున్నారు. ఇదిలా వుంటే పి.కె కూడా కాంగ్రెస్‌ నాయకత్వం ఎలా వుండాలో నిర్దేశాలు జారీ చేస్తున్నారు. గాంధీలు అధ్యక్ష స్థానంలో లేకపోతే మెరుగని ఆయన సలహా ఇస్తున్నారు. లేదంటే కనీసం వర్కింగ్‌ అధ్యక్షులుగానైనా ఇతరులను నియమించాలని చెబుతున్నారు. దేశమంతా తెలిసిన నాయకత్వం గాంధీ కుటుంబమేనని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా స్పష్టం చేస్తున్నారు. అసలు జి-23 తిరుగుబాటు తర్వాత సంస్థాగత ఎన్నికలు పూర్తి చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్టానం తనకు తానుగా గానీ పి.కె చెప్పారని గాని నాయకత్వంపై ఏకపక్షంగా ఎలా మాట్లాడుతుంది? అంటే గతంలో చెప్పింది బూటకమే అనుకోవాలా? అసలు తాము నియమించుకునే ఏజంటు వచ్చి నాయకత్వం ఎలా వుండాలో చెబితే వినడం ఏమాత్రం గౌరవం? ప్రియాంక వంటి వారు ఆయన రాకకు అనుకూలంగా వున్నారనే వార్తలు ఆసక్తికరమైనవి. ఏదో జరగబోతున్నదనే భావన కలిగించేందుకు పి.కె ప్రహసనం ఉపయోగపడుతుందని కాంగ్రెస్‌ అధిష్టానం అనుకుంటుండొచ్చు.
రాజకీయ ప్రశ్నలు కూడా ఇంకా వున్నాయి. గతంలో పి.కె పని చేసిన పార్టీలలో అనేకం కాంగ్రెస్‌ వ్యతిరేకమైనవి. ఈ సమయంలోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తోనూ సంప్రదింపులు జరుపుతున్నారని ఆయనే చెప్పారు. మమతా బెనర్జీ తమ సంస్థాగత వ్యవహారాలలో జోక్యాన్ని అనుమతించలేదు గాని సలహాదారుగా కొనసాగిస్తున్నది. ఎ.పి లో జగన్‌ తోనూ సంబంధం కొనసాగుతున్నది. అలాంటప్పుడు రెండు విరుద్ధ శక్తులకు ఒకే వ్యక్తి ఎలా సలహాదారుగా వుండగలరు? వైసిపి తో పొత్తుకు సూచన చేశారని వార్తలు వస్తే వారు ఖండించారు. ఇప్పటికీ ప్రధాని మోడీకి ప్రత్యామ్నాయం అనదగిన నాయకుడు రాలేదని పి.కె బహిరంగంగానే చెప్పివున్నారు. చెబుతుంటారు కూడా. అసలు సూత్రప్రాయంగా ఆయన మతతత్వ వ్యతిరేకినని ఎప్పుడూ చెప్పుకోలేదు. బిజెపి ని ఎన్నికల్లో ఓడించాలని తప్ప విధానపరంగా ఎదుర్కోవాలన్నది లేదు. పి.కె చిట్కాల్లో విధానపరమైన అంశాల కన్నా వివిధ తరగతుల ప్రజలను ఎలా విడదీసి వాడుకోవాలన్నదే ప్రధానంగా వుంటుందని పరిశీలకులు అంటారు. అత్యధిక చోట్ల అధికారానికి దూరంగా వున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు ఈ ఫార్ములా ఎలా ఉపయోగపడగలదు? ఒక విధంగా ఆయన పనులు పరోక్షంగా బిజెపి కి మేలు చేసే దిశలో వుంటాయనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తుంటాయి. తనే స్వయంగా అచేతనావస్థలో కూరుకునిపోయిన కాంగ్రెస్‌కూ ప్రశాంత్‌ కిశోర్‌కు మధ్యన సాగుతున్న ప్రహసనం ఈ ప్రశ్నలన్నీ ముందుకు తెస్తుంది. అంతర్గత ప్రజాస్వామ్యం, లౌకిక ప్రజాస్వామిక సూత్రాల గురించి ఆలోచన లేకుండా ఊరికే ఎన్నికల పాచికలతో ఎవరైనా ఏదైనా చేయగలరనుకోవడం భ్రమే. అందులోనూ ఎత్తు పడిన ఎద్దు లాంటి కాంగ్రెస్‌ను లేపడం మరింత కష్టం. ఏ సూత్రానికి కట్టుబడని పి.కె, ఎలాంటి కట్టుబాటు లేని కాంగ్రెస్‌లు కలసినా సాధించగలిగేది తక్కువే. కాంగ్రెస్‌ పెద్ద పార్టీ అనేది నిజమైనా స్వయంకృతాపరాధాల వల్ల చిన్న శక్తిగా దిగజారిపోయింది. ముందు ఆ పార్టీ తన దృక్పథాన్ని, నిర్మాణాన్ని సరిచేసుకుంటే గాని..అనైక్యతను అధిగమిస్తే గాని.. చేసేది శూన్యం. ఈ లోగా పి.కె వివాదాస్పద విధానాలు కొత్త సమస్యలకు, సవాళ్లకు దారి తీసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

తెలకపల్లి రవి