ప్రజాశక్తి - మంత్రాలయం
మండలంలోని రచ్చుమర్రి గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు పీస్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య తెలిపారు. బుధవారం రచ్చుమర్రి గ్రామానికి సిఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ కిరణ్ బాబుతో పాటు పోలీసు సిబ్బందితో చేరుకున్న ఆయన వాల్మీకులతోనూ, దళితులతోనూ వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. సోమవారం రచ్చుమర్రి గ్రామంలో ఏరువాక పౌర్ణమి పండగ సందర్భంగా నిర్వహించిన పరుగు పందెంలో దళితులను బహిష్కరించడంపై దళితులైన శాంతిరాజు, ఏసేపు ప్రశ్నించినందుకు బోయ కులస్తులు దాడి చేసిన విషయంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిమీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారత రాజ్యాంగం ప్రకారం సమానంగా జీవించే హక్కు అన్ని కులాలు, వర్గాలకు ఉందని, కుల వివక్ష చూపుతే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. అనంతరం గ్రామంలోని వాల్మీకులను, దళితులను కలిపి పీస్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో 12 మంది వాల్మీకులతో దళితులు అంగీకరించారని మాధవరం ఎస్‌ఐ కిరణ్ బాబు తెలిపారు.
గ్రామస్తులతో మాట్లాడుతున్న డీఎస్పీ సీతారామయ్య










