
'పీరియడ్స్.. బహిష్టు.. ముట్టు.. నెలసరి.. రెస్ట్.. డేట్..' పదం ఏదైనా... పలికేది ఎవరైనా.. ఆ పదం ఎవరికీ తెలియకూడనిదిగా ఇంకా వ్యవహరిస్తున్న దుస్థితిలో ఉన్నామన్నది వాస్తవం. ఆ సమయంలో విపరీతమైన అవస్థపడుతూ పంటిబిగువున పనిచేసే వారెందరో. ఒకవేళ తట్టుకోలేని పరిస్థితుల్లో మరో కారణం చెప్పి సెలవు తీసుకునేవారే చాలామంది. ఎక్కువ శాతం అధికారులుగా, అధిపతులుగా పురుషులే ఉండటం వల్ల.. వారితో ఈ విషయం మాట్లాడటానికి స్త్రీలు సంకోచిస్తారు. కానీ.. ఈ విషయం రహస్యం కాదు.. స్త్రీ శరీరధర్మంలో ఒకటి. ఆ విషయం పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. ఈ సమస్యకు పెయిన్ కిల్లర్స్ పరిష్కారం కాకపోగా, దుష్ఫలితాలు కలుగుతాయి. అందుకే పీరియడ్స్ సమయంలో సెలవు అధికారికంగానే ప్రకటించాలి. అలా చేయడం స్త్రీల ఆరోగ్యం పట్ల బాధ్యత తీసుకోవడమే. దీనిపైనే ఈ ప్రత్యేక కథనం.
మహిళల ఋతుస్రావం గురించి ఇటీవల ఎక్కువగా మాట్లాడటం ఓ మంచి పరిణామం. మే 28వ తేదీని ''అంతర్జాతీయ బహిష్టు పరిశుభ్రతా దినంగా'' ప్రకటించడం అంటే ఆ సమస్య ఎంత తీవ్రంగా ఉందో వెల్లడిస్తోంది. ఈ తేదీ ఎంపిక అర్థవంతమైంది. స్త్రీలలో ప్రతి 28 రోజులకీ ఐదు రోజులు ఉండే ఋతుచక్రాన్ని ప్రతిబింబించేలా సంవత్సరంలో ఐదో నెలయిన మేలో 28వ తేదీని 'అంతర్జాతీయ బహిష్టు పరిశుభ్రతా దినం'గా ప్రకటించారు. ఎన్నో మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ అంశం మీద పనిచేస్తున్నాయి. స్త్రీలను, బాలికలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపడుతున్నాయి. నెలసరి చుట్టూ బలంగా అల్లుకున్న మౌనాన్ని బద్దలుగొట్టే కార్యక్రమాల్ని చేపడుతున్నాయి. ఈ ప్రచారోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. ఈ పరిస్థితులకు పీరియడ్స్ లీవ్ అనేదీ ప్రధానంగా తోడ్పడేది.. పరిశుభ్రతను పెంచేది.

సౌకర్యాల లేమి..
బడి అయినా.. కాలేజీ అయినా.. ఆఫీసు అయినా.. అందులో ఉండే బాలికలకు, యువతులకు, స్త్రీలకు సరైన సదుపాయాలు ఉండాలి. పీరియడ్స్ పరిశుభ్రత విషయంలో బాత్రూమ్స్, నీటి వసతి ప్రధానమైనవి. ఇప్పటికీ సరైన బాత్రూమ్ సౌకర్యం లేని బడులు, కాలేజీలు, ఆఫీసులు అనేకం. ఇక నీటి వసతి లేమి చాలా ప్రధానమైన సమస్య. శానిటరీ ప్యాడ్స్‌గానీ, శానిటరీ ప్యాడ్స్ మిషన్‌గానీ అందుబాటులో లేకపోవడం. ప్యాడ్స్ బర్నింగ్ మిషన్స్ కూడా అవసరమే. ఎక్కువమంది ఉన్నచోట ఇలాంటివి తప్పనిసరి. ఇవన్నీ ఇంకా సమస్యగా కొనసాగడానికి జెండర్ సెన్సిటివిటీ లేకపోవడమూ ఒక కారణం. ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు. ఆయా ప్రదేశాల్లో వారికి సౌలభ్యంగా ఉండే ఏర్పాట్లు చేయకపోవడం అందుకే అనేది వాస్తవం. పీరియడ్స్ సమయంలో ప్యాడ్స్ మార్చుకోవడానికీ సరైన సదుపాయం ఉండదు. ఎన్ని అవస్థలు పడుతున్నారో అనుభవించేవారికే తెలుసు. ఇక వ్యవసాయరంగంలో, రోడ్లు, వివిధ అసంఘటితరంగాల్లో పనిచేసే మహిళల అవస్థలు అనూహ్యం. కొన్ని ఆక్వా పరిశ్రమల్లో మహిళలను బాత్రూమ్స్‌కూ వెళ్లనీయని దయనీయ పరిస్థితులున్నాయి. వెళ్లినా సమయం పెట్టి పంపే దుస్థితి. అదే పీరియడ్స్ సమయంలో అయితే, వారి అవస్థలు చెప్పనలవి కాదు. అందుకే ఎక్కువగా ఋతుక్రమాన్ని వాయిదా వేసేందుకు వీరు మాత్రలు తీసుకుంటుంటారు. అదీ మెడికల్ షాపుల్లో అడిగి తెచ్చుకుంటారు. ఫలితంగా స్త్రీలు అనేక అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.

సెలవు ఎందుకంటే..
ప్రతినెలా పీరియడ్స్ వచ్చినప్పుడు శరీరంలో జరిగే మార్పులు ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటాయనేది మహిళలందరికీ తెలుసు. ఇంకా వివరంగా చెప్పాలంటే... కొందరికి కేవలం అసౌకర్యం మాత్రమే ఉండవచ్చు. కానీ కొంతమందికి విపరీతమైన కడుపునొప్పి ఉంటుంది. నడుము విరిగిపోతున్నంత బాధగా ఉంటుంది. కళ్లు తిరుగడం, వాంతులు అయ్యేలా అనిపిస్తుంది. కొందరిలో ఓవర్ బ్లీడింగ్ సమస్య ఉంటుంది. కదిలినా, దగ్గినా, తుమ్మినా, నవ్వినా.. రక్తస్రావం ఎక్కువగా అవుతుంటుంది. ముఖ్యంగా ఎండోమెట్రియోసిస్ / ప్రీమెన్‌స్ట్రువల్ డైస్ఫోరిక్ డిజార్డర్ (పీఎండీడీ) లాంటివి ఉంటే భరించలేనంత బాధగా ఉంటుంది. ఆ సమయంలో వారికి విశ్రాంతి చాలా అవసరమని స్త్రీ వైద్య నిపుణులు చెప్తున్నారు.
నేటికీ మన దేశంలో పీరియడ్స్ గురించి బాహాటంగా మాట్లాడుకునే పరిస్థితులు లేవు. వస్త్రాలకు మరకలు అంటుతాయనే భయం.. శానిటరీ ప్యాడ్స్ కొనుక్కోవడానికి మొహమాటం.. అదేదో కొనకూడదని కొంటున్నట్లు.. రహస్యంగా షాపుల్లో తీసుకుంటుంటారు. చాలాచోట్ల వాటిని నల్లటి కవర్‌లో చుట్టి ఇస్తుంటారు. అసలు మనకు ఎలాంటి సౌకర్యవంతమైన ప్యాడ్స్ కావాలో అడగడానికీ ఇబ్బందిగా ఫీలవుతారు. అసలు ఇంట్లో తండ్రి, సోదరుడు, భర్తకు వీటి గురించిన అవగాహన ఉండాలి. ఇంట్లో సరుకులు తెచ్చేటప్పుడు శానిటరీ ప్యాడ్స్ కూడా తేవాలి. ఒకవేళ అవసరం ఎక్కువుంటే, ఆ విషయం వారితో సదరు కుటుంబంలోని స్త్రీలు పంచుకోవాలి. ఇలాంటి వాతావరణం కుటుంబాల్లో రావాల్సిన అవసరం ఉంది. పనిచేసే చోట పీరియడ్స్ సమయంలో నొప్పి అని చెబితే ఎక్కడ అనారోగ్యులుగా పరిగణిస్తారోనని అనుకుంటుంటారు.

కట్టుబాట్లు బ్రేక్ చేయాలి!
సామాజికంగా ఉన్న కట్టుబాట్ల సంగతి ఇక చెప్పాల్సిన పనేలేదు. పీరియడ్స్‌లో ఉంటే పెళ్లిళ్లకు, పేరంటాలకు, పండుగలు, పబ్బాలకు, కుల, మత పరమైన కార్యక్రమాలకు దూరంగా ఉంచే దురాచారాలున్నాయి. వాటిని బ్రేక్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 'హ్యాపీ టూ బ్లీడ్' ఉద్యమంగానీ, శబరిమలయకు స్త్రీలంతా వెళ్లాలనే దృక్పథంగానీ.. పీరియడ్స్‌ను ఆరోగ్యకర సూచికగా చూడటం వల్లే సాధ్యమైంది. ఏదేమైనా అన్నివైపుల నుండి స్త్రీలు పీరియడ్స్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. గోప్యత పాటించడం వల్ల దీనిపట్ల పురుషులకు అవగాహన ఏమోగానీ, మన ఆడపిల్లలకూ తెలియకపోవడం విచారకరం. ఒక అధ్యయనం ప్రకారం, మనదేశంలో 71 శాతం బాలికలకు ఋతుక్రమం ప్రారంభమయ్యే వరకూ దీని గురించిన అవగాహన ఉండటం లేదు.
ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా..?
పీరియడ్స్ లీవ్ లేదా మెనుస్ట్రువల్ లీవ్ అనేది ఇప్పుడు కొత్తగా చర్చల్లోకి వచ్చిన అంశమేమీ కాదు. పీరియడ్స్ గురించి ఎలా అయితే మాట్లాడరో.. దీనికి సంబంధించిన సెలవు గురించీ ఎవ్వరూ మాట్లాడరు. అందుకే ఈ అంశం కొత్తగా మాట్లాడుతున్నట్లు చాలామంది అనుకుంటుంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు శతాబ్ద కాలంగా దీనిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 1922లో సోవియట్ యూనియన్, 1947లో జపాన్, 1953లో దక్షిణ కొరియా తమ జాతీయ విధానాల్లో భాగంగా పీరియడ్స్ లీవ్‌ను ప్రవేశపెట్టాయి. ఇండోనేషియా, జాంబియా, తైవాన్, చైనాలో కొన్ని ప్రాంతాల్లో పీరియడ్స్ లీవ్‌ను జాతీయ విధానాల్లో పొందుపరిచారు. అయితే అమెరికా, యూరప్, పలు అభివృద్ధి చెందిన దేశాల్లో దీని గురించి అశ్రద్ధే కొనసాగుతోంది. స్త్రీ ఆరోగ్య శ్రేయస్సు, మెరుగైన పనితీరు కోసం సెలవు అనేది అవసరం. నెలసరి చుట్టూ ఉన్న అపోహలు, ఆంక్షలు, భయాలను పోగొట్టడం కోసం అన్ని దేశాల్లో పీరియడ్స్ లీవ్ ప్రవేశపెట్టడం ఉత్తమమైన చర్య అనేది ప్రపంచంలోని స్త్రీ ఉద్యమకారులు, హక్కుల ఉద్యమకారులు చెప్తున్నారు.

మన దేశంలో..
అరుణాచల్‌ప్రదేశ్ మాజీ ఎంపీ నినోంగ్ ఎరింగ్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పనిచేసే మహిళలకు నెలలో రెండు రోజులు పీరియడ్స్ లీవ్ కేటాయించాలని 2017లో 'మెనుస్ట్రువేషన్ బెనిఫిట్ బిల్లు' ను ప్రవేశ పెట్టారు. దీన్ని ప్రైవేట్ మెంబర్స్ బిల్లుగా ప్రవేశపెట్టారు. అయితే, ఈ బిల్లు పాస్ అవ్వలేదు. అప్పటి నుంచి పార్లమెంటులో ఆ అంశం చర్చకూ రాలేదు. కానీ, బిల్లు ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చను తీసుకొచ్చింది. ఉద్యోగులకు, ముఖ్యంగా మహిళలకు మెరుగైన పని వాతావరణాన్ని కల్పించేందుకు దేశంలో మెరుగైన కార్మిక చట్టాలను తీసుకురావాలనే డిమాండ్ మనదేశంలో కార్మిక సంఘాల నేతృత్వంలో ఊపందుకున్నాయి. అయితే, గత 30 ఏళ్లుగా దేశంలో పీరియడ్స్ లీవ్ విధానాన్ని అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం బీహార్. అప్పటి ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ 1992లో ఉద్యోగినులకు నెలకు రెండు రోజుల పీరియడ్స్ లీవ్ మంజూరు చేశారు. మన దేశంలో పీరియడ్స్ లీవ్ ఇవ్వాలా వద్దా అనే అంశం వివాదాస్పదంగానే ఉంది. దీనికి మద్దతిచ్చేవారు సంఖ్య ఎక్కువున్నా, వ్యతిరేకించేవారూ ఉన్నారు.
ఆదర్శంగా ఆ సంస్థలు..
ముందుగా మూడు భారతీయ సంస్థలు ఉద్యోగినులకు పీరియడ్స్ లీవ్ ప్రకటించాయి. ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో 2020లో స్త్రీలకు పీరియడ్స్ లీవ్ ప్రకటించింది. 2021లో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ మహిళలకు నెలకు రెండు రోజులు ''టైమ్ ఆఫ్'' ను ప్రకటించింది. ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ కూడా ఉద్యోగినులకు నెలకొక పీరియడ్స్ లీవ్ ప్రకటించింది. జొమాటో సంస్థ ఫౌండర్, సీఈఓ తమ సంస్థలోని ఉద్యోగినులకు ఒక లేఖ జారీ చేశారు. అందులో 'కడుపు నొప్పనో, ఒంట్లో బాగాలేదనో చెప్పక్కర్లేకుండా ''నాకు పీరియడ్స్ మొదలయ్యాయి, రెస్ట్ కావాలి!'' అని నిర్మొహమాటంగా, ధైర్యంగా చెప్పగలిగే అవకాశం మీకుండాలి. అందుకే జొమాటో ఏడాదికి 10 పీరియడ్స్ సెలవులు ప్రకటిస్తోంది. పీరియడ్ సెలవులకు అప్లై చేసుకోవడానికి సిగ్గుపడాల్సిన, మొహమాటపడాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో మిమ్మల్ని ఎవరైనా అవమానించినా, అభ్యంతరకరంగా వ్యవహరించినా మా దృష్టికి తీసుకురావచ్చు' అని పేర్కొన్నారు.
ఈ ఏడాది (2022) మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ సంస్థ తమ కంపెనీలో పనిచేసే స్త్రీలకు పీరియడ్స్ లీవ్ పాలసీ ప్రకటించింది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగినులు నెలకు ఒకరోజు సెలవు తీసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. సంస్థలో సమానత్వం, సహకారం పెంపొందించేందుకు ఫ్లిప్‌కార్ట్ పీరియడ్స్ లీవ్ పాలసీ ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. మార్చి ఒకటవ తేదీ నుంచి దీన్ని అమల్లోకి తెచ్చినట్లు సంస్థ వెల్లడించింది.
ఏదేమైనా ఈ పీరియడ్ లీవ్ బహిష్టు పరిశుభ్రత నినాదానికి తోడ్పడేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సమయంలో అవసరమైన స్త్రీలు రెస్ట్ తీసుకోవడం వల్ల మరింతగా ఉత్పత్తిని పెంచేక్రమంలో తోడ్పడతారు. అలాకాకుండా పెయిన్‌కిల్లర్స్ వంటివి వాడటం వల్ల అనారోగ్యం పాలవుతారు. అవస్థపడుతూ పనిమీద శ్రద్ధ కూడా పెట్టలేరు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని పీరియడ్స్ లీవ్ అన్ని రంగాల్లో అమలయ్యేలా నిర్ణయిస్తూ ప్రభుత్వాలు ప్రకటించాలి. వీటి గురించిన అవగాహన ఉండబట్టే సోవియట్ యూనియన్ ప్రపంచంలో తొలిగా అమలుచేసింది.

వ్యతిరేక వాదనలు..
స్త్రీలకు ప్రత్యేకంగా పీరియడ్స్ లీవ్ కేటాయించడం వర్క్‌ప్లేస్‌లో వివక్షకు దారితీస్తుందని కొందరు వాదిస్తున్నారు. అంతేకాకుండా, పీరియడ్స్ లీవ్ అమల్లోకొస్తే కంపెనీలు స్త్రీలకు ఉద్యోగాలు ఇవ్వడానికి వెనుకాడతాయని అంటున్నారు. అయితే ఇప్పటికే, శ్రామికశక్తిలో మహిళలే అధిక శాతంగా ఉన్నారు. వాళ్ల భాగస్వామ్యం లేకుండా ముందుకెళ్లలేవనేది వాస్తవం. అసలు సెలవులే ఇవ్వడానికి నిరాకరించే ప్రయివేటు యాజమాన్యాలు ఇప్పుడు పీరియడ్స్ లీవ్ తోడైతే అంగీకరించవనేది మరికొందరి వాదన. నెలసరి సమయంలో సెలవులు తీసుకోవడమంటే స్త్రీలు అబలలు అని ఒప్పుకోవడమేననీ, తమని అనారోగ్యులనే ముద్ర వేస్తారనీ మరికొందరు వాదిస్తున్నారు. జొమాటో 2020లో పీరియడ్స్ లీవ్ ప్రకటించినప్పుడు జర్నలిస్ట్ బర్కాదత్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి సెలవులు స్త్రీలకు ఇవ్వడం బయలాజికల్ వ్యత్యాసాలను బలపరచడమేనని, మహిళలు బలహీనులని నిరూపించడమేనని ఆమె వాదించారు. 'సారీ, జొమాటో.. మీ నిర్ణయం మంచి ఉద్దేశంతో తీసుకున్నదే అయినా, మహిళలను వేరుపరుస్తుంది. బయలాజికల్‌గా స్త్రీలు బలహీనులనే అంశానికి బలం చేకూరుస్తుంది. మేం ఓ పక్క సైన్యంలో చేరాలి, యుద్ధాన్ని రిపోర్ట్ చేయాలి. ఫైటర్ జెట్స్ నడపాలి, అంతరిక్షంలోకి ప్రయాణించాలని కోరుకుంటూ, మరోపక్క పీరియడ్స్ లీవ్ కావాలని అడగడం సబబు కాదు' అంటూ ఆమె ట్వీట్ చేశారు. పీరియడ్స్‌లో ఉన్నప్పుడే కార్గిల్ యుద్ధం గురించి రిపోర్ట్ చేశాననీ ఆమె మరొక ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఎపిఎస్‌ఆర్టీసీలో అమలు..
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగినులకు ముఖ్యంగా మహిళా కండక్టర్లకు నెలకు మూడురోజులు తప్పనిసరి సెలవులు ఇస్తున్నారు. సంస్థ వెల్ఫేర్ అసోసియేషన్ గత ఐదేళ్లుగా ఈ విధానాన్ని అమలుచేస్తోంది. అంతకుముందు సెలవులకు వీలుంటేనే ఇచ్చేవారు. కానీ, సుమారు ఐదేళ్లుగా, మహిళా కండక్టర్లు పీరియడ్స్‌కు సెలవు కావాలని అప్లికేషన్ పెడితే కచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇది రూలు. కండక్టర్లకే కాదు, ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగినులు ఎవరైనా ఈ సెలవులు తీసుకోవచ్చు. అయితే, అందరూ సెలవులు తీసుకోవాలనేమీ లేదు. కొంతమందికి అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. వాళ్లు విధుల్లోకి వస్తారు. ఇది ఛాయిస్ మాత్రమే. కానీ, లేడీ కండక్టర్లకు ఆ మూడు రోజులూ చాలా కష్టం. వాళ్లకు కచ్చితంగా సెలవులు ఇవ్వాల్సిందే. తెలంగాణ ఆర్టీసీలో మాత్రం తప్పనిసరి నిబంధన లేదు. వీలును బట్టి సెలవులు ఇస్తారు. మహిళా కండక్టర్లు అడిగినప్పుడు చాలావరకూ సెలవు ఇవ్వడానికే ప్రయత్నిస్తారు. కానీ, ఇవ్వాలన్న రూలేమీ లేదు.

ట్రాన్స్‌జెండర్లకూ ..
ఈ ఏడాది ఫ్లిప్‌కార్ట్ సంస్థ పీరియడ్స్ లీవ్ ప్రకటించినప్పుడు 'మహిళలకూ, ట్రాన్స్‌జెండర్లకూ ఈ పాలసీ వర్తిస్తుంది!' అని పేర్కొంది. అయితే, చాలామంది 'ట్రాన్స్‌జెండర్లకు పీరియడ్స్ ఏమిటి?' అంటూ అవహేళన చేశారు. ట్రాన్స్ వుమెన్‌కూ పీరియడ్స్ బాధ ఉంటుందనే విషయం అవగాహన లేకపోవడమేనని ట్రాన్స్‌జెండర్స్ సమాధానం. ట్రాన్స్‌జెండర్లలో ఉద్యోగాలు చేస్తున్నవారి శాతమే చాలా తక్కువ. ఇక పీరియడ్స్ నొప్పి, బాధ విషయానికొస్తే, ట్రాన్స్ వుమెన్‌కి రుతుస్రావం ఉండదని, వారికి ఎలాంటి బాధా ఉండదని చాలామంది అనుకుంటారు. అది తప్పు. ట్రాన్స్‌జెండర్స్‌కూ పీఎంఎస్, పీఎండీడీ (ఋతుక్రమానికి సంబంధించిన ఇబ్బందులు) ఉంటాయి. వీరిలో అమ్మాయిలుగా పుట్టి, అబ్బాయిలుగా మారిన వారిని ట్రాన్స్ మెన్ అంటారు. అబ్బాయిలుగా పుట్టి అమ్మాయిలుగా మారినవారిని ట్రాన్స్ వుమెన్ అంటారు. ట్రాన్స్ వుమెన్ సాధారణంగా ఈస్ట్రోజెన్ హార్మోన్ థెరపీ తీసుకుంటారు. వీరికి ఋతుస్రావం ఉండకపోవచ్చు. కానీ, ఋతుస్రావానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. ప్రతి నెలా వారికి నొప్పి, బాధ ఉంటుంది. ఈ అంశంపై చాలా అధ్యయనాలు ఉన్నాయి. అలాగే ట్రాన్స్ మెన్‌కూ పీరియడ్స్ బాధ ఉంటుంది. వీళ్లు పుట్టుకతో అమ్మాయిలు. వాళ్లు టెస్టోస్టిరాన్ హార్మోన్లు తీసుకుంటారు. సర్జరీలు చేయించుకుంటారు. అయినప్పటికీ, వాళ్లకి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే, పీఎంఎస్, పీఎండీడీ సమస్యలూ ఉంటాయి. అలాంటప్పుడు వీళ్లకీ పీరియడ్స్ లీవ్ అమలుకావాలి.

పీరియడ్ ట్రాకర్..
మొబైల్‌లో పీరియడ్ ట్రాకర్ డౌన్‌లోడ్ చేసుకున్న అమ్మాయిలకు పీరియడ్ తేదీలు, సమయాన్ని అలర్ట్ చేస్తుంది. ఇది ముఖ్యంగా స్కూలుకు, కాలేజీలకు, ఆఫీసులకు, పనుల మీద బయటకు వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇందుకోసం ముందుగా ఫోన్‌లో పీరియడ్ ట్రాకర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. నెలసరి వచ్చిన తేదీని అందులో ఫీడ్ చేయాలి. ఇక ఆ తర్వాత, ఆ ట్రాకర్ నెలసరి సమయాన్ని మానిటర్ చేసి, రుతుస్రావం రావడానికి నాలుగు రోజుల ముందు నుంచే మీకు పీరియడ్ వచ్చే అవకాశం ఉందని చెబుతూ అలర్ట్ చేస్తుంది. దీంతో పాటు, పీరియడ్స్ సమయంలో తీసుకోవలసిన పోషకాహారం, నీటి మోతాదు గురించీ చెబుతూ ఉంటుంది. కొన్ని ట్రాకర్స్‌లో వైద్యులు, న్యూట్రిషనిస్ట్‌లకు సంబంధించిన సమాచారమూ ఉంటుంది. నెలసరి ముగిసిన తర్వాత శరీరంలో అండం విడుదలయ్యే తేదీలు, సమయాన్నీ అలర్ట్ చేస్తుంది. దీనివల్ల ఇది గర్భధారణ ప్రణాళిక చేసుకునేందుకూ తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, నెలసరి సక్రమంగా వచ్చేవారికి ఈ పీరియడ్ ట్రాకర్ ఉపయోగపడుతుంది. పీసీఓడీ, థైరాయిడ్, పెరీ మెనోపాజ్, ప్రీ-మెనోపాజ్‌తో బాధపడేవారికి సైకిల్ ఒక ప్రధాన సమస్య. అలాంటి వారికి దీనివల్ల ప్రయోజనం ఉండదు.

పెయిన్ 'కిల్లర్స్'..
తమిళనాడులో కొన్ని వస్త్ర పరిశ్రమల్లో పనిచేసే మహిళలకు నెలసరి సమయంలో సెలవులు పెట్టకుండా చూసేందుకు యాజమాన్యాలే పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నట్లు బయటపడింది. ఫలితంగా ఆ స్త్రీలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ పరిశీలనలో వెల్లడైంది. ఆ సంస్థ వందమంది మహిళలతో మాట్లాడింది. నొప్పి నివారణ మందులను తాము పని చేసేచోటే ఇచ్చారని వారు చెప్పారు. వారంతా పేద, బడుగు వర్గాలకు చెందిన మహిళలు. తమిళనాడులోని కోయంబత్తూర్, తురుప్పూర్, దిండుగల్ ప్రాంతాలలో అనేక వస్త్ర పరిశ్రమలు, స్పిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో తమిళనాడులోని వివిధ ప్రాంతాలతో పాటు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారూ అనేకమంది పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది మహిళలే. నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గించేందుకు పెయిన్‌కిల్లర్స్ ఇస్తున్నారు. ఫలితంగా మహిళల ఋతుచక్రం దెబ్బతింటోందని ఆ ఫౌండేషన్ వెల్లడించింది.
సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ చెప్పేదేమంటే.. 'పీరియడ్స్ సమయంలో మహిళల్ని ఎలా చూసుకోవాలన్న దానికి సంబంధించి కచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. తమిళనాడు అధికారులు ఈ కార్మికులతో మాట్లాడుతున్నారు. ఆ నిబంధనలను ఎవరూ అతిక్రమించేందుకు వీల్లేదు. ఎవరైనా వాటిని ఉల్లంఘిస్తే వారిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు మరెప్పుడూ జరగకూడదు. ఈ విషయంపై మాతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే, మేము అందుకు సిద్ధంగా ఉన్నాం' అంటోంది.
నవ్యసింధు, 8333818985