Aug 28,2023 00:28

చిలకలూరిపేట ప్రాంతంలో పీపాలలో నీటిని తెచ్చి పంటలకు పోస్తున్న రైతులు

ప్రజాశక్తి - చిలకలూరిపేట : ఖరీఫ్‌ చివర దశకు వచ్చింది వ్యవసాయానికి సరిపడా వర్షాల్లేక సాగు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంటలేయాలన్నా, మందులు పిచికారీ చేయాలన్నా అవసరమైన నీరు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. పత్తి, మిర్చి ఇతర వాణిజ్య పంటల సాగుకు, పై మందులు వేయడానికి నీరు కావాలంటే నీరు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ కారణాలతో చిలకలూరిపేట మండలం, నియోజకవర్గంలో మొత్తం సాగు భూమిలో 40 శాతం విస్తర్ణంలోనే పంటలు సాగయ్యాయి. మండలంలో ప్రతిఏడాది 13-15 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని. ప్రస్తుతం నాలుగైదు వేల ఎకరాలకు మించలేదు. మిర్చి 1800 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేస్తే 880 ఎకరాల్లోనే సాగైంది. ఇతర పంటల సాగు 600 ఎకరాల నుండి 150 ఎకరాలకు పడిపోయింది. వరి సాగు మరింత తక్కువగా ఉంది.
2020-21లో చిలకలూరిపేట ప్రాంతంలో ఆగస్టులో 255.6 మిల్లీ మీటర్ల వర్షంపాతం నమోదవగా ఆ తర్వాత సంవత్సరం 183.8 మిట్లీ మీటర్లుగా ఉంది. ప్రస్తుతం కేవలం 84.6 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది. వర్షాభావ పరిస్థితులకు ఈ గణాకాలే అద్దం పడుతున్నారు. దీనికితోడు మునుపెన్నడూ లేనంతగా నీటి సదుపాయం ఉన్న పొలాలకు కౌలు పెరిగింది. గతంలో ఎకరకు రూ.20 వేల కౌలుంటే ఇప్పుడు రూ.30-35 వేలైంది. గతేడాది మిర్చిసాగు ఆశా జకనకంగా ఉండడంతో ఈ ఏడాది ఎక్కువ మంది అదే పంట సాగుకు మొగ్గు చూపగా వర్షాభావ పరిస్థితులతో వారంతా అందోళనలో ఉన్నారు. ఈ ఏడాది 3500 ఎకరాల వరకూ మిర్చి సాగుకు రైతులు సిద్ధమవడంతో అందుకు అనుగుణంగానే నర్సరీల్లోనూ నారును పెంచారు. తీరా నీరు లేకపోవడంతో నాట్లు వేయడానికి వీల్లేకుండా ఉంది. గతేడాది 2200 ఎకరాల్లో పత్తి సాగవగా ప్రస్తుతం 500 ఎకరాలకే పరిమితమైంది. 45-50 రోజుల దశలో ఉన్న ఈ పైరుకు మందులు వేయాలన్నా వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి సాగర్‌ కాల్వకు నీరు విడుదల చేస్తే ఉన్న పంటలకు జీవం పోసుకోవడంతోపాటు మిగతా పొలాల్లో సాగుకూ అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు.
నీరు బయట కొనాల్సిందే
చెన్నుపాటి రాజు, కౌలురైతు,
గతేడాది ఎకరా కౌలు రూ.20 వేలు చొప్పున మూడెకరాల్లో మిర్చి సాగుచేశా. ఈ ఏడాది రూ.36 వేలు కౌలుచెల్లించి ఐదెకరాల సాగు చేపట్టా. ప్రస్తుతం 57 రోజుల దశలో పైరుంది. తొలి విడదల మందులు వేయడానికి కుంటల్లో నీరు సరిపోతుంది. ఆ తర్వాత నీరు అవసరమైతే పీపాల ద్వారా కొనాల్సిందే.