Jul 09,2023 21:29

మాట్లాడుతున్న ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

పీలేరు : కాంక్రీట్‌ అరణ్యంలా మారుతూన్న పీలేరు పట్టణాన్ని హరితవనంలా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ కలసి రావాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం పీలేరు పంచాయతీ కార్యాలయం ఆవరణంలో సర్పంచ్‌ డాక్టర్‌ షేక్‌ హబీబ్‌ బాష ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల ముందున్న పీలేరు స్థితికి, ప్రస్తుతమున్న పరిస్థితికి ఎంతో వ్యత్యాసం ఉందని అభిప్రాయపడ్డారు. పట్టణంలో రోజు రోజుకూ పెరుగుతూన్న కాలుష్యాన్ని అధికంగా మొక్కలు నాటి నివారణ చర్యలు పాటిద్దామని అన్నారు. వాతావరణ సమతుల్యాన్ని కాపాడ్డానికి చెట్లు ఎంతో ఉపకరిస్తాయని గుర్తించే సర్పంచ్‌ హబీబ్‌ బాష ప్రతి ఇంటికి ఓ చెట్టు ఉండాలన్న లక్ష్యంతో వివిధ రకాల పండ్లు, పూలు, నీడనిచ్చే 15,009 మొక్కలను అందిస్తున్నారని చెప్పారు. మనం పీలేరు ఓ హరితవనంలో భవిష్యత్‌ తరాలకు అందివ్వాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. పట్టణాన్ని కాలుష్య రహితంగా అభివద్ధి చేస్తూ ఇతరులకు ఆదర్శవంతులుగా స్థానిక ప్రజలు ఉండాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఓవైపు జనాభా పెరుగుతుంటే, మరోవైపు చెట్లు తరిగిపోతున్నాయన్నారు. ఫలితంగా పెరుగుతూన్న జనాభాకు తగినంత ప్రాణవాయువు లభించే పరిస్థితులు రాను రాను మగ్యమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాబట్టి మన భావితరాల్లో జన, జీవరాసుల జీవం కోసం తగినంత ఆక్సిజన్‌ అందాలంటే ఇప్పుడు మనం మొక్కలు నాటి వాటిని పెంచే బాధ్యతను తీసుకోవాలని కోరారు. అనంతరం పట్టణంలోని ఐదు సచివాలయాల పరిధిలోని సిబ్బందికి మొక్కలు పంచి పెడుతూ వాటిని పెంచే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 3580 దానిమ్మ, 4351 జామ, 3160 అల్లనేరేడు, 1875 బాదం, 741 పచ్చ తురాయి, 694 ఎర్రతురాయి, 608 కుక్క నేరేడు మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ డాక్టర్‌ షేక్‌ హబీబ్‌ బాష, జడ్పిటిసి ఏటి రత్నశేఖర్‌రెడ్డి, వైస్‌ ఎంపిపిలు నెల్లూరి వెంకటాచలపతి, హరితా వెంకటరమణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్‌ నాగరాజు అమ్మ, డిసిసిబి డైరెక్టర్‌ స్టాంపుల మస్తాన్‌ సాహెబ్‌, వైసిపి మండల కన్వీనర్‌ దండు జగన్మోహన్‌రెడ్డి, రాయలసీమ జోన్‌ వైసిపి మహిళా ప్రధాన కార్యదర్శి మహితా ఆనంద్‌, ఎఎంసి చైర్మన్‌ చంద్రగిరి ఎల్లయ్య, మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యులు రెడ్డి బాష, వార్డు సభ్యులు, ఎంపిటిసిలు, పంచాయితీ ఇఒ రెడ్డిప్రసాద్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.