
ప్రజాశక్తి - ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ) కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రవేశాల విభాగం సంచాలకు డాక్టర్ జి.అనిత తెలిపారు. ఈ ప్రవేశాలకు సంబంధించి అభ్యర్థులు అనివార్య కారణాలతో ఏపీ పీజీసెట్ రాయలేక పోయినవారికి యూనివర్సిటీ నిర్వహించే ప్రత్యేకమైన సెట్ ద్వారా ప్రవేశాలు కల్పించే అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన పీజీ కోర్సుల్లో ఎంఎస్సీ కాంపిటేషనల్ డేటా సైన్స్, ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ, ఎంఎస్సీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఎంఎ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్‌లేషన్ స్టడీస్, ఎంఎ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (థియేటర్, సినిమా), ఎంఎ మ్యూజిక్, ఎంఎ డాన్స్, ఎంటెక్ ఇన్ ఇరిగేషన్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజినీరింగ్, ఎంబిఎ మీడియా మేనేజ్మెంట్, ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్, బిఎ మ్యూజిక్, బిఎ డాన్స్, బిఎ ప్లానింగ్, బిఎ డిజైన్ కోర్సులకు సంబంధించి సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులతో వర్సిటీ నిర్వహించే అర్హత పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. పై కోర్సులతోపాటు పలు పీజీ డిప్లమా కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. వాటిల్లో అంబేద్కర్ స్టడీస్, గాంధీయన్ స్టడీస్, బుద్ధిస్ట్ స్టడీస్, యోగ, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, డిప్లమా కోర్సుల్లో ఫిల్మ్ మేకింగ్, డైరెక్షన్, ఫొటోగ్రఫీ, యాక్టింగ్ వంటి కోర్సులకు సంబంధించి ఆసక్తి ఉన్న అభ్యర్థులు విశ్వవిద్యాలయంలోని పీజీ అడ్మిషన్ల కార్యాలయాన్ని సంప్రదించాలని డాక్టర్ అనిత సూచించారు.