కడప అర్బన్ : యోగివేమన విశ్వవిద్యాలయ పీజీ నాలుగో ( చివరి) సెమిస్టరు పరీక్షలు, మూడేళ్ల ఎల్‌ఎల్‌బి, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి సెమిస్టర్ల పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. విసి ఆచార్య చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్య, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎస్ రఘునాథ్ రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎన్.ఈశ్వరరెడ్డి విస్తత తనిఖీ చేశారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఆర్ట్స్ బ్లాక్, సైన్స్ బ్లాక్, కామర్స్, మేనేజ్మెంట్ బ్లాక్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎల్‌ఎల్బీ పరీక్షలు రాసే విద్యార్థులతో సందడి వాతావరణం నెలకొంది. ఈసారి పరీక్ష విధుల్లో ప్రతి ఒక్కరిని బాధ్యులుగా చేయడంతో అన్ని శాఖల్లోనూ పరీక్ష సమయాల్లో హడావుడి కనిపిస్తోంది. పరీక్షల వికేంద్రీకరణ వల్ల చదువుతున్న తరగతి గదుల్లో, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు సంతోషంగా పరీక్షలు రాస్తున్నారు. ఉదయం 10 గంటలకు పరీక్షలు ప్రారంభం కానుండడంతో అధ్యాపకులు, సిబ్బంది విశ్వవిద్యాలయ పనివేళల కంటే ముందుగా వచ్చి విద్యార్థుల పరీక్షల కు సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్నారు. పరీక్షల నిర్వహణలో అన్ని శాఖల సహాయ ఆచార్యులు, సహా ఆచార్యులు, ఆచార్యులు, బోధ నేతర సిబ్బంది పాల్గొన్నారు.










