ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన్ మందిర్‌లో ప్రజాగాయకుడు గద్దర్ సంస్మరణ సభ సోమవారం రాత్రి జరిగింది. పలువురు గాయకులు తమ పాటలతో సభికులను ఊర్రూతలూగించారు. ప్రముఖ గాయకులు విమలక్క, పి.వి.రమణ, పల్లె నరసింహ, నూకతోటి శరత్, రాజేష్, కత్తి లెనినా తదితరులు గద్దర్ రాసినపాటలతోపాటు పలు విప్లవగీతాలతో సభికులను ఆకట్టుకున్నారు. గద్దర్ సంస్మరణసభ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జరిగినసభలకు ప్రముఖ న్యాయవాది వై.కె.అధ్యక్షత వహించారు. సభలో ప్రముఖ సినీనటుడు ఆర్.నారాయణమూర్తి ప్రసంగిస్తూ గద్దర్ నిజమైన అంబేద్కరిస్టు అన్నారు. బుర్రకథ పితామహుడు నాజర్ స్పూర్తితో గద్దర్ ప్రజాగాయకుడుగా ఎదిగారన్నారు. పీడిత వర్గాల కోసం తాను నమ్మిన సిద్ధాంతాలకు రాజీపడకుండా జీవన ప్రయాణం చేసిన మహోన్నత వ్యక్తి గద్దర్ అన్నారు. కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకం కావాలని ఆకాక్షించారన్నారు. ఈ సభలో విసికెపార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ తిరుమా వళవన్ మాట్లాడుతూ అంబేద్కర్ సిద్ధాంతాలకు ప్రభావితుడై దళితులు, గిరిజనుల, పీడిత వర్గాల కోసం గద్దర్ పనిచేశారని అన్నారు. మాజీమంత్రులు నక్కాఆనంద్‌బాబు, డొక్కా మాణిక్య వరప్రసాద్, మేయర్ కావటి మనోహర్ నాయుడు, మాజీ ఎంపి యలమంచిలి శివాజీ,గోళ్ల అరుణ్‌కుమార్ తదితరులు ప్రజా గాయకుడుగా గద్దర్ చేసిన సేవలను కొనియాడారు. కళాకారుడిగా ఆయన ఎంతో మందికి సూర్ప్తిదాయకుడుగా నిలిచారని చెప్పారు. ఈ సందర్భంగా గద్డర్‌చిత్రపటంకు పూలమాలలు వేసినివాళి అర్పించారు. నిర్వహణకమిటీ సభ్యులు ఎన్.బ్రహ్మయ్య, విద్యాసాగర్, ప్రకాష్, జూపూడి శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, ప్రభుదాస్, తాటికొండ నరసింహారావు, నీలాంబరం, బాబూరావు పాల్గొన్నారు.










