Sep 03,2023 23:54

గద్దర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు

ప్రజాశక్తి-తగరపువలస: తాడిత, పీడిత ప్రజల గొంతు ప్రజా గాయకులు గద్దర్‌ అని పలువురు కళాకారులు, వామ పక్ష నాయకులు కొనియాడారు. స్థానిక సిఐటియు కార్యాలయం ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం గద్దర్‌ సంస్మరణ సభ నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ఆయన పాడిన ప్రతి పాటా సమ సమాజ స్థాపన కోసమేనని పేర్కొన్నారు. కారం చేడు దారుణ ఘటన పైనా, అమెరికా సామ్రాజ్యవాదం పైనా, ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంపైనా ఆయన ఎన్నో పాటలు రాసి పాడారని పేర్కొంటూ పాటల తూటా బహుజన కళా మండలి రాష్ట్ర కార్యదర్శి ఎ.ఉదయ భాస్కర్‌ సభలో పాటలు పాడి వినిపించారు. ఈ సభలో సిపిఎం, సిపిఐ నాయకులు ఆర్‌ఎస్‌ఎన్‌.మూర్తి, అల్లు బాబూరావు, కె.రాంబాబు, సిఐటియు నాయకులు నీలాతి రాము, ఉత్తరాంధ్ర కళాకారుల పౌరాణిక నాటక రంగ ఉపాధ్యక్షులు ఉప్పాడ అప్పారావు, కళాకారులు రామకృష్ణ, పోతురాజు తదితరులు పాల్గొన్నారు.