రూ.50 వేల ఆస్తి నష్టం
ప్రజాశక్తి - పెదవేగి
మండలంలోని విజయరాయి గాంధీనగర్‌లో కొబ్బరి పీచు పరిశ్రమలో సోమవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. సకాలంలో సిబ్బంది, ఆగ్నిమాపక శాఖ స్పందించటంతో పెను ప్రమాదం తప్పింది. జిల్లా సహాయక అగ్నిమాపక ఫైర్ ఆఫీసర్ వి.రామకృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం... విజయరాయి గ్రామంలో గాంధీనగర్‌లో వై.తిరుమలరావు అనే వ్యక్తి సుబ్రహ్మణ్యేశ్వర క్వాయర్ ఇండిస్టీ నిర్వహిస్తున్నారు. సోమవారం యధావిధిగా సిబ్బంది పని చేస్తుండగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కావటంతో మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బందితో మంటలు ఆర్పే ప్రయత్నం చేసి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ జిల్లా సహాయ ఫైర్ అధికారి వి.రామకృష్ణారావు ఏలూరు నుంచి తమ సిబ్బందితో ఫైర్ ఇంజన్‌తో సహా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 వేల ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. అగ్నిమాపక శాఖ సకాలంలో రావడం వల్ల సమారు రూ.11.50 లక్షల మేర ఆస్తిని కాలిపోకుండా కాపాడారు. సకాలంలో అగ్నిమాపక శాఖ స్పందించకపోతే భారీ నష్టాన్ని చవిచూసేవారిమని పరిశ్రమ యజమాని తిరుమలరావు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు గానీ ప్రాణ నష్టం సంభవించలేదు.










