Jul 28,2023 17:17

ప్రజాశక్తి - భీమడోలు
        వాతావరణ మార్పుల నేపథ్యంలో రోగులకు సేవలందించేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని పూళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌, భీమడోలు ఎంపిపి కనుమాల రామయ్య కోరారు. పూళ్ళ పిహెచ్‌సి వేదికగా అభివృద్ధి కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షత వహించిన ఎంపిపి మాట్లాడుతూ పూళ్ళ పిహెచ్‌సి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం పలువురు మన్ననలను పొందుతుందన్నారు. పిహెచ్‌సిలో సంస్థాగతంగా జరుగుతున్న ప్రసవాల సంఖ్య మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్య కేంద్రం వైద్యులకు సూచించారు. మందులు కొరత లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సుఖ ప్రసవాలు జరిగిన తర్వాత చికిత్స పొందుతున్న బాలింతలను పరామర్శించారు. వారికి అందుతున్న సేవలు గురించి ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోజువారీ వచ్చే రోగులు ఎదుర్కొనే సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రం యాజమాన్యం విజ్ఞప్తి మేరకు ఆరోగ్య కేంద్రం ఆవరణంలో మెరక చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి అదనంగా పూళ్ళ-ఎంఎం పురం రహదారి నుంచి ఆరోగ్య కేంద్రానికి చేరేందుకు ఏర్పాటుచేసిన గ్రావెల్‌ రోడ్డును ఆధునీకరించి సీసీ రోడ్డుగా మార్చేందుకు ఎంపిపి లేదా జడ్‌పి నిధులు సమకూర్చుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్‌ లీలా ప్రసాద్‌ మాట్లాడుతూ నీటి కాలుష్యం, దోమలు కారణంగా ప్రస్తుత సీజన్లో సీజనల్‌, వైరల్‌ జ్వరాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటి నుంచి రక్షణ పొందవచ్చన్నారు. పిహెచ్‌సిలో నెలవారీ ఐదు తగ్గకుండా ప్రసవాలు జరుగుతున్నాయని, ఈ సంఖ్యను మరింతగా పెంచేందుకు కృషి చేస్తానన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ అంశంతో అందిస్తున్న వైద్య సేవలు నూరు శాతం అమలవుతున్నాయని తెలిపారు. తాజాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమంలో భాగంగా భీమడోలు గ్రామ సచివాలయం రెండు, మూడు పూళ్ళ ఆరోగ్య కేంద్రం పరిధిలోనికి వచ్చాయని, అక్కడ సైతం తమ ఆరోగ్యకేంద్ర సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు, పూళ్ళ సర్పంచి దాయం సుజాత ప్రసాద్‌, కురెళ్ళగూడెం సర్పంచి నాగ గౌతమితో పాటు పిహెచ్‌సి వైద్యులు డాక్టర్‌ కల్యాణ మహేశ్వరి పాల్గొన్నారు.