పిహెచ్‌సిలో 'రంగు' పడలే...!
కళావిహీనంగా ఆస్పత్రి
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)
ప్రజల ఆరోగ్య భద్రత కోసం జననివాస ప్రాంతాలకు సమీపంలో నేషనల్ హెల్త్ మిషన్, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నడుస్తున్నాయి. ప్రమాదకరమైన ఎయిడ్స్, టీబి, పిల్లల సంరక్షణ, సంపూర్ణ కుటుంబ ఆరోగ్యం, టీకా ఇలా అనేక చిత్రాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై చిత్రాలు వేసి చూపరులకు ఆరోగ్య భద్రతను తెలియజేసే విధంగా రంగులద్దారు. అయితే మంగళం పరిధిలోని సప్తగిరి కాలనీలో ఉన్న మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రస్తుతం కళావిహీనమైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రంగులు వేయడానికి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి వచ్చామని, ప్రభుత్వం ఇందుకోసం నిధులు మంజూరు చేసిందని కాంట్రాక్టు దక్కించుకున్న గుత్తేదారుడు మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పదుల సంఖ్యలో జిల్లా పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నూతన రంగులు వేయాలని ఉన్న చిత్రాలపైనే పెయింటింగ్ చేశారు. అయితే గుత్తేదారుడు పూర్తిస్థాయిలో పెయింటింగ్ పూర్తి చేయకుండా రెండు నెలలుగా పని ఆపేయడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి కళావిహీనంగా తయారైంది. మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేవలం బయట మాత్రమే పెయింటింగ్ పనులు చేసి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోపల ఎటువంటి పనులు ప్రారంభించలేదు. దీనిపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని వివరణ కోరగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి వచ్చాము అని చెప్పి కొంత భాగం మాత్రమే పనులు చేసి వెళ్లిపోయారని సమాధానం ఇచ్చారు. ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మంచి సంకల్పంతో చేపట్టిన పనులు గుత్తేదారులు సకాలంలో పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.










