Aug 26,2023 21:41

వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న డిఐఒ జగన్నాథరావు

ప్రజాశక్తి-మక్కువ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలపై దృష్టి సారించాలని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి టి. జగన్మోహనరావు వైద్యులకు, సిబ్బందికి సూచించారు. శనివారం మండలంలోని శంబర, మక్కువ పిహెచ్‌సిలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ప్రసవాలు ఏ మేరకు జరుగుతున్నాయి, వాటి నిర్వహణ రికార్డులను పరిశీలించారు. ప్రసూతి గదులను పరిశీలించి డెలివరీ సమయంలో ఉపయోగిస్తున్న పరికరాలు, అత్యవసర మందులు, ఆక్సిజన్‌ సదుపాయం, తదితర అంశాలపై సిబ్బందిని ఆరాతీశారు. బేబీ వార్మర్‌ పనితీరును పరిశీలించారు. నెలవారీ పిహెచ్‌సిలో జరుగుతున్న సాధారణ ప్రసవాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాం ద్వారా గ్రామాల్లో ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. పిహెచ్‌ల్లో డెలివరీ అయ్యేలా వైద్య సిబ్బంది తగు చర్యలు చేపట్టాలన్నారు. నూతన పిహెచ్‌సి భవన నిర్మాణ దశ, ప్రక్రియపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణాలు పూర్తయితే మరింత మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. వ్యాక్సిన్‌ నిల్వలు, మందులు, ల్యాబ్‌ తనిఖీ చేశారు. అనంతరం డాక్టర్‌ జగన్మోహనరావు మాట్లాడుతూ జ్వరాలను గుర్తిస్తే వెంటనే చికిత్స అందజేసి, క్షేత్ర స్థాయిలో నివారణ చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. పిహెచ్‌సికి వచ్చిన రోగులతో ఆయన మాట్లాడి, వారి అనారోగ్య సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్‌ జి.హరికృష్ణ, ఎంవి.కిరణ్‌ కుమార్‌, సూపర్‌వైజర్‌ సరస్వతి, వెంకటరత్నం, వైద్య సిబ్బంది ఉన్నారు.