Oct 09,2023 21:25

రోగితో మాట్లాడుతున్న డిఐఒ జగన్మోహన్‌రావు

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలపై దృష్టి సారించాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి(డిఐఒ) డాక్టర్‌ టి. జగన్మోహనరావు సూచించారు. ఈ మేరకు ఆయన డోకిశీల పిహెచ్సిలో గర్భిణులకు నిర్వహించిన పిఎంఎస్‌ఎం (పిఎంఎస్‌ఎ) కార్యక్రమాన్ని సోమవారం తనిఖీ చేశారు. గర్బిణులకు నిర్వహిస్తున్న ఆరోగ్య తనిఖీలు, ల్యాబ్‌ పరీక్షలు పరిశీలించారు. ఎమ్‌సిపి కార్డులు, రికార్డులు తనిఖీ చేసి అందులో నమోదు చేసిన ఆరోగ్య వివరాల నివేదికలను పరిశీలించారు. రక్తహీనతగా గుర్తించిన గర్భిణులకు ఏ విధమైన చర్యలు చేపడుతున్నారని సిబ్బందిని ఆరా తీశారు. గర్భిణులతో డిఐఒ మాట్లాడుతూ ప్రతి రోజూ ఐరన్‌, కాల్షియం మాత్రలు వేస్తున్నారా, వైద్య సిబ్బంది గృహ సందర్శన చేసి ఆరోగ్య పర్యవేక్షణ చేస్తున్నారా, అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. కొత్తగా నమోదైన గర్భిణులకు పూర్తి స్థాయిలో ల్యాబ్‌ పరీక్షలు జరుగుతున్నాయా అని తనిఖీ చేశారు. ఇంతవరకు గుర్తించిన హై రిస్క్‌ గర్బిణులతో పాటుగా కొత్తగా తనిఖీలో ఎంత మంది గర్భిణీల్లో హైరిస్క్‌ ను గుర్తించా రని వైద్యాధికారులను అడిగారు. వీరికి అవసరమైన చికిత్స పక్కాగా ఉండాలని, క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు గృహ సందర్శనలు చేసి వారి ఆరోగ్య పరిశీలన చేయాలని ఆదేశించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉన్న గర్భిణుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం వార్డులో ఐరన్‌ సుక్రోజ్‌ ఇంజెక్షన్లు తీసుకుంటున్న గర్బిణులను సందర్శించి హీమోగ్లోబిన్‌ శాతాన్ని రిపోర్టులో పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు బి.నిహారిక, జి. శిరీష, సూపర్‌ వైజర్స్‌ శ్రీనివాసరావు, ఎస్‌. జయ, జయగౌడ్‌, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.