Sep 15,2023 21:31

వైద్యసేవలపై సిబ్బందితో మాట్లాడుతున్న డిఐఒ జగన్మోహనరావు

ప్రజాశక్తి - గరుగుబిల్లి : స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి(డిఐఒ) డాక్టర్‌ టి. జగన్మోహనరావు శుక్రవారం సాయంత్రం తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది హాజరు పరిశీలించి ఏ విధమైన వైద్య సేవలు అందిస్తున్నారు, రాత్రి సమయాల్లో ఏ విధమైన అత్యవసర చికిత్స అవసరమైన కేసులు నమోదవుతున్నాయి, అందుకు అవసరమైన మందులు తదితర అవసరమైన వివరాలపై సిబ్బందిని ఆరా తీసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పిహెచ్‌సికి చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి వారి అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారికి ఎటువంటి చికిత్స వైద్య సిబ్బంది అందజేశారో పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో పాముకాటు కు గురైన వారు, తీవ్రమైన జ్వరాలతో ఉన్నవారు ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉన్నందున రాత్రి వేళల్లో సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఆరోగ్య కార్యాలయ డెమో వై .యోగీశ్వరరెడ్డి, సూపర్‌ వైజర్‌ జయగౌడ్‌ ఉన్నారు.