Aug 17,2023 00:15

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకరరావు

ప్రజాశక్తి-అనకాపల్లి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కంటింజెంట్‌ వర్కర్లను పర్మినెంట్‌ చేయాలని కంటింజెంట్‌ వర్కర్ల రాష్ట్ర అధ్యక్షులు పి.దుర్గారావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.శంకర్‌రావు డిమాండ్‌ చేశారు. బుధవారం జరిగిన కంటింజెంట్‌ వర్కర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కంటింజెంట్‌ వర్కర్లుగా గత 25 సంవత్సరాల నుండి పని చేస్తున్న వారిని నేటికీ పర్మినెంట్‌ చేయకపోవడం సరికాదని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వాలు కంటింజెంట్‌ వర్కర్లను పర్మినెంట్‌ చేస్తామని హామీలు ఇచ్చినా ఎవరూ అమలు చేయలేదన్నారు. ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణతో పాటు డ్రెస్సింగ్‌ ఇతర పనులు వర్కర్లకు అప్పగిస్తున్నారని, కనీసం సెలవులు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. 15 క్యాజువల్‌ లీవ్‌ ఇవ్వాల్సి ఉండగా మెడికల్‌ ఆఫీసర్లు సెలవులు లేవని చెబుతున్నారని, అనేక ఆసుపత్రుల్లో 24 గంటలు డ్యూటీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌, డైలీవేజ్‌, కంటింజెంట్‌ వర్కర్లను పర్మినెంట్‌ చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో కలిపి జీతాలు ఇస్తున్నారని, దాని నిబంధన ప్రకారం వీరికి ప్రతి ఏటా 15 సెలవులు ఉన్నాయని, వాటిని ఎక్కడా అమలు చేయడం లేదని పేర్కొన్నారు. అనారోగ్యం ఇతర కారణాలతో సెలవు పెడితే జీతంలో కోతలు పెడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని హితవుపలికారు. కంటింజెంట్‌ వర్కర్ల సమస్యలపై భవిష్యత్తులో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు శేషు, కార్యదర్శి సూర్యప్పారావు, కొణతాల నూకరాజు, సూరయ్యమ్మ, వర్కర్లు పాల్గొన్నారు.