Mar 13,2023 22:46

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: వన్‌టౌన్‌ కొత్తపేటలో గల పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో 15వ కళాశాల వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఎంతో రంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎపి ఎస్‌సిహెచ్‌ఇ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మారుతున్న ఆధునిక టెక్నాలజీలో పట్టు సాధించినప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని తెలిపారు. జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజికల్‌ యూనివర్సిటీ కాకినాడ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ జి.వి.ఆర్‌. ప్రసాదరాజు మాట్లాడుతూ యువత సృజనాత్మకతతో కూడిన ఆవిష్కరణలను రూపొందించినప్పుడే దేశ భవిష్యత్తు దేదీప్యమానంగా ఉంటుందన్నారు. కళాశాల సెక్రటరీ పి. లక్ష్మణ స్వామి మాట్లాడుతూ ఆధునిక సమాజంలో టెక్నాలజీలో వస్తున్న నూతన మార్పులకు అనుగుణంగానే విద్యార్థులను తయారు చేసే అన్ని విషయాలలో తమ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది ఎల్లప్పుడూ ముందుంటారని గుర్తు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జె. లక్ష్మీనారాయణ వార్షిక నివేదికను తెలియజేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ స్థాయిలో మొదట ర్యాంకు సాధించిన ఎస్‌. తనూజ లక్ష్మి స్రవంతిని బంగారు పతకంతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఉత్తమ విద్యా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు.