Sep 26,2023 00:27

ఉత్తమ రైతుకు ప్రోత్సాహక బహుమతి అందిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి అచ్యుతాపురం
సహకార సంఘాల్లో ఆర్థిక లావాదేవీలపై ఇన్‌కమ్‌ టాక్స్‌ వసూలు నిలిపివేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తిమ్మరాజుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం సోమవారం సంఘం చైర్‌పర్సన్‌ కాండ్రేగుల అప్పారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ సహకార సంఘం ఏర్పడినప్పటి నుంచి సంఘ లావాదేవీలపై ఎటువంటి ట్యాక్స్‌ వసూలు చేసే సాంప్రదాయం లేదన్నారు. ఇటీవల కాలంలో బిజెపి ప్రభుత్వాలు సహకార సంఘాల లావాదేవీలు పై ఇన్కమ్‌ టాక్స్‌ వసూలు చేయడం అన్యాయమన్నారు. అక్రమంగా అన్యాయంగా సహకార సంఘాల్లో ఆర్థిక లావాదేవీలపై వసూలు చేస్తున్న ఇన్కమ్‌ టాక్స్‌, టీడీఎస్‌ వంటే వాటిని నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు డీలర్లకు సరఫరా చేస్తున్నట్లుగా సహకార సంఘాలకు ఎరువులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సంఘ సీఈవో ఐ.సూర్య మహేశ్వరరావు 2022-23 సంవత్సరాలు వార్షిక నివేదికను చదివి వినిపించారు. సంఘంలో 24 కోట్ల 40 లక్షల 8782 రూపాయలు డిపాజిట్లు సేకరించడం జరిగిందన్నారు. ఉభయ జిల్లాల్లో అత్యధిక డిపాజిట్లు కలిగిన సహకార సంఘంగా తిమ్మరాజుపేట పిఎస్‌ఎస్‌ గుర్తింపు పొందిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సంఘంలో ఉత్తమ రైతులకు పిఎసిఎస్‌ చైర్మన్‌ కాండ్రేగుల అప్పారావు, సంఘ పూర్వపు అధ్యక్షులు ఎం సూర్యనారాయణ, సరగడము పరశురాముడు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సమావేశంలో బీసెట్టి అమ్ము నాయుడు, బుద్ధ నాగేశ్వరరావు, ఎస్‌ శివ బాబు నాయుడు, సంఘ సహాయ కార్యదర్శి రాపిటి విశ్వేశ్వరరావు, మారిశెట్టి రామారావు, తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి : రైతుల అవసరాలు తీర్చడంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పాత్ర అమోఘమని ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ బోర్డు చైర్మన్‌ దంతులూరి దిలీప్‌ కుమార్‌ అన్నారు. తుమ్మపాల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (అన్న పూర్ణబ్యాంక్‌) మహాజనసభ బ్యాంకు ఆవరణలో సోమవారం నిర్వహించారు. సంఘం సెక్రటరీ ఆడిట్‌ రిపోర్టు, బడ్జెట్‌ సభ్యులకు చదివి వినిపించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సంఘ అధ్యక్షులు పిడి గాంధీ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఐదు లక్షలు 19 వేల రూపాయలు లాభం వచ్చిందని, త్వరలోనే సభ్యులకు లాభాలు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపిపి గొర్లి సూరిబాబు, సంఘం డైరెక్టర్లు సకలా సంతోష్‌, బొడ్డు దేవుడు, తుమ్మపాల సర్పంచ్‌ తట్టా పెంటయ్య నాయుడు, జెడ్‌పి వైస్‌ చైర్‌పర్సన్‌ బీవీ సత్యవతి, తుమ్మపాల ఎంపీటీసీ సభ్యులు, 150 మంది సభ్యులు పాల్గొన్నారు.