Apr 13,2023 23:58

కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-అనకాపల్లి
రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ప్రైవేటీకరించే చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 17న రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల వద్ద ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ అగ్రికల్చరల్‌ కోపరేటివ్‌ సొసైటీ యూనియన్‌ (సిఐటియు) పిలుపుమేరకు ధర్నాలను చేపట్టనున్నట్టు యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పి నాగభూషణం తెలిపారు. స్థానిక అన్నపూర్ణ పిఎసిఎస్‌లో గురువారం ధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 1964 సహకార చట్టానికి కొత్తగా 115 ఈ నిబంధన చేర్చి ప్రైవేటు వ్యక్తులకు కంపెనీలకు 50 శాతం వాటాలను కట్టబెట్టి వారికి ఓటింగ్‌ కల్పించడం ద్వారా సహకార సంఘాలు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతు భరోసా కేంద్రాలను సహకార సంఘాల్లో విలీనం చేస్తూ చేసిన చట్ట సవరణ వల్ల సహకార సంఘాలు ప్రైవేటీకరణకు దారి తీసే ప్రమాదముందన్నారు. అసెంబ్లీ కౌన్సిల్‌ పాస్‌ చేసిన వీటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌ శివరామకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగులకు వేతనాలుకు సంబంధించి వైసిపి ప్రభుత్వం 2020లో జారీ చేసిన 90 జిఒను నేటికీ అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. నష్టాల్లో ఉన్న సంఘాలను కూడా ఇన్కమ్‌ టాక్స్‌ కట్టమని ఆదేశించడంతో వాటి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని, వాటిని పరిరక్షించుకునేందుకు ఉద్యమ బాట పట్టామని తెలిపారు. ఈనెల 17న జరిగే కలెక్టరేట్‌ ధర్నాలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షులు మల్ల స్వామి చంద్ర నాయుడు, కోశాధికారి ఓఎస్‌ ఈశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.