Jan 27,2023 23:51

రోడ్డుపై ధాన్యం బస్తాలు ఉంచి బైఠాయించిన రైతులు

ప్రజాశక్తి -మునగపాక రూరల్‌
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని గ్రామ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రైతుల రోడ్డు ఎక్కారు. ధాన్యం మూటలు రోడ్డుపై వేసి బైఠాయించారు. ధాన్యం కొనుగోలు తక్షణం చేయాలని, రైతులను ఆదుకోవాలని, రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సమయంలో ట్రాఫిక్‌ స్తంభించడంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే వ్యవసాయశాఖ అధికారి వచ్చి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇచ్చే వరకు ధర్నాను విరమించేది లేదని రైతు నాయకులు తెగేసి చెప్పారు. దీంతో రైతులతో చర్చించాలని వ్యవసాయ అధికారి జోష్నా కుమారిని పోలీసులు కోరడంతో ఆమె రైతులు ధర్నా చేసే ప్రాంతానికి వచ్చి రైతులతో చర్చించారు. పైఅధికారులతో చర్చించి శనివారం నుండి ధాన్యం కొనుగోలు జరిగేలా ప్రయత్నిస్తామని ఆమె హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. దీనికి ముందు రైతు నాయకులు దాడి ముసిలి నాయుడు, ఆడారి మహేష్‌, ఎస్‌.బ్రహ్మాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు జరిగేదని, తద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేదని తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం రైతులను ఆదుకుంటున్నామని ఆర్భాటాలు చేసిన ముఖ్యమంత్రి, ఆ స్థాయిలో కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. స్థానిక రైతు భరోసా కేంద్రంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ధాన్యం నాణ్యతను పరిశీలించిన తర్వాతనే మిల్లర్లకు తరలిస్తున్నామని, కానీ మిల్లర్లు లేని కారణాలను చూపించి ధాన్యాన్ని తిరిగి పంపించటం ఏమిటని ప్రశ్నించారు. ధాన్యం సేకరణపై ప్రభుత్వం నిర్ణయాత్మకమైన చర్యను తీసుకోకపోతే అన్నదాతలు ఆత్మహత్యలకు గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్‌ అధ్యక్షులు కోనపల్లి రామ్మోహన్‌ రావు, రైతు నాయకులు మల్ల సంజీవరావు, భీమరశెట్టి శ్రీనివాసరావు, మల్ల వరాహా నరసింగరావు, మొల్లేటి సత్యనారాయణ, దాడి శివ, విల్లూరి నూక నరసింహారావు, శరగడం జగన్‌, ప్రసాద్‌, టెక్కలి పరశురాం తదితరులు పాల్గొన్నారు.