ప్రజాశక్తి-బాపట్ల: పిఎసిఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో ఉద్యోగులు సోమవారం బాపట్ల పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా పిఎసిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు పెంట్యాల హనుమంతరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్న సహకార సంఘాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని పిఎసిఎస్‌లో 50శాతం వాటాధనాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలనే చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పిఎసిఎస్ ఉద్యోగులకు జీవో30, 90 ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యూటీ చట్టం అమలు చేయాలన్నారు. హెచ్‌ఆర్ పాలసీ అమలుచేసి వేతన సవరణను చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగానే ప్రతి ఐదేళ్లకొకసారి వేతన సవరణ జరగాలని కోరారు. జీవో నెంబర్ 36 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సహకార సంఘ ఉద్యోగులకు అరవై రెండేళ్లకు రిటైర్మెంట్ వయసును పెంచాలని కోరారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం పడదని తెలిపారు. సహకార సంఘాల్లో ఉన్న ఖాళీలు వెంటనే భర్తీ చేయాలన్నారు. 2019 తర్వాత సహకార సంఘాల్లో పని చేస్తున్న సిబ్బందిని రెగ్యులర్ చేయాలన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మజుందార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సహకార సంఘాలను ప్రైవేటుపరం చేస్తే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారని అంశాన్ని ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల రైతులకు సొసైటీల ద్వారా ఆర్థిక సాయం అందకుండా వడ్డీ వ్యాపారుల కబంద హస్తాలలో ఇరుక్కుపోయే విధంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని విమర్శించారు. సహకార సంఘ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న న్యాయమైన సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. సహకార సంఘ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి సిఐటియు సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. అనంతరం డిమాండ్స్‌తో కూడిన వినతిపత్రాన్ని స్పందనలో డిఆర్‌ఓకు అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రామాంజనేయులు, ఎంపీ మల్లికార్జునరావు, చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల పిఎసిఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.










