Apr 18,2023 00:31

ప్రదర్శన నిర్వహిస్తున్న పిఎసిఎస్‌ ఉద్యోగులు

ప్రజాశక్తి బాపట్ల : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల దీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పిఎసిఎస్‌ ఉద్యోగులు సోమవారం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోఆపరేటివ్‌ సొసైటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ బాపట్ల జిల్లా శాఖ గౌరవాధ్యక్షుడు సిహెచ్‌. మజుందర్‌ మాట్లాడుతూ జిల్లాలోని పిఎసిఎస్‌ ఉద్యోగుల సమైస్యలు దీర్ఘ కాలంగా పరిష్కారం కాలేదన్నారు. వేతన సవరణ, సంఘాలకు ఇన్‌ కంటాక్స్‌ టిడిఎస్‌జిఒ ఎం.ఎస్‌ 36 మరియు 90ని అమలు చేయలేదని తెలిపారు. దీంతో సమస్యలు ఉద్యోగులను వెంటాడుతున్నాయి. ఈ సమస్యలపై అనేక సార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ప్రభుత్వ స్పందన కరువైందన్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల వ్యవస్థ మనుగడ, ఉద్యోగుల భవిష్యత్‌ కోసం ఉద్యోగులంతా ఆందోళన బాట పట్టాల్సిన అవసరం ఉందన్నారు. పిఎసిఎస్‌లలో 50శాతం వాటాలను ప్రైవేటు వ్యక్తులకు,కంపెనీలకు రైతు భరోసా కేంద్రాలను పిఎసిఎస్‌లలో విలీనం చేస్తూ 1964 చట్టానికి చేసిన సవరణలను వెంటనే రద్దు చేయాలన్నారు. 36 జీవో, వేతనాలను, ఇతర బెనిఫిట్లను వెంటనే అమలు చేయాలన్నారు. 2019 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త వేతన సవరణ చేయాలన్నారు. ధాన్యం సేకరణలో ఇబ్బందులను తొలగించాలన్నారు.టిడిఎస్‌లోని ఇబ్బందులను తొలగించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్‌ సొసైటీ ఎంప్లాయీస్‌ యూని యన్‌ బాపట్ల శాఖ అధ్యక్షుడు పి.హనుమంతరావు ,ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరావు, కోశాధికారి ఆంజనేయులు, రాష్ట్ర సభ్యుడు మస్తాన్‌ రావు, కన్వీనర్‌ వై. బుచ్చయ్య చౌదరి , పిఎసిఎస్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.