ప్రజాశక్తి-పాడేరు టౌన్: ప్రాథమిక వ్యవసాయ రుణ పరపతి సంఘం (పిఎసిఎస్) ప్రైవేటీకరణ ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, ఎపి స్టేట్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అబీన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.కలెక్టరేట్ గేటు వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పిఎసిఎస్ ఉద్యోగులు సోమవారం ధర్నా చేపట్టి నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 2019లో జారి చేసిన ఉద్యోగుల వేతన సవరణ జిఒ అమలు చేయాలని, రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బికె) పిఎసిఎస్‌లో విలీనం చేయ్యొద్దని డిమాండ్ చేశారు. ఉద్యోగుల వేతన సవరణ జిఒ-36ను వైసిపి ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో అమలు చేయకపోగా, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పరపతి సహకార సంఘాలను బహుళ ప్రయోజనాల సంఘాలుగా మార్చాలన్న ఆదేశాన్ని వైసిపి ప్రభుత్వం అమలు చేసి పిఎసిఎస్‌లను ప్రైవేటు రంగం చేతిలో పెడుతుందన్నారు. సహకార సంఘాల ప్రైవేటీకరణతో ఉద్యోగులతో పాటు రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుందని తెలిపారు. 2019 ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగుల పేరివిజన్ అమలు చేయాలన్నారు. ఉద్యోగ విరమణ వయసును ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 62 ఏళ్లకు పెంచాలన్నారు. సంఘాలన్నీ కంప్యూటరీకరణ చేయాలని, టిడిఎస్‌లో ఉన్న ఇబ్బందులు తొలగించాలని, ప్రాథమిక సహకార పరపతి సంఘాల ఉద్యోగుల న్యాయ సమ్మతమైన సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సత్యనారాయణ, అప్పలనాయుడు, కేశవరావు, జోగేశ్వరరావు, కృష్ణ పాల్గొన్నారు.










