ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండల కేంద్రం భట్టిప్రోలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి చెందిన అద్దేపల్లిలోని గోడౌన్ శిథిలావస్థకు చేరటంతో ఎట్టకేలకు తొలగింపునకు శ్రీకారం చుట్టారు. గత 60 ఏళ్ల క్రితం నిర్మించిన అద్దేపల్లి మొగల్ స్ట్రీట్‌లోని ఈ గోడౌన్ 30 ఏళ్లుగా దెబ్బతిని నిరూపయోగం అయ్యింది. ఈ గోడౌన్ శిథిలమై పాములు చేరి గృహాలలోకి వస్తున్నాయని, గతంలో చుట్టుపక్కల వారు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న నాథుడే లేడని అప్పట్లో ప్రజలు ఆరోపించారు. కాగా ఎట్టకేలకు ఈ గోడౌన్‌ను తొలగించి నూతన గోడౌన్ నిర్మాణం చేపట్టాలని సొసైటీ పాలకవర్గం భావించినట్లు కనిపిస్తోంది. సుమారు 6 సెంట్ల స్థలంలో ఉన్న ఈ గోడౌన్ స్థానంలో మరో గోడౌన్ నిర్మిస్తే పిఎసిఎస్ సమస్య తీరుతుంది. ఇప్పటికే సూరేపల్లి సొసైటీకి దాతలు ఇచ్చిన స్థలంలో అవసరమైన గోడౌన్ నిర్మించి వినియోగించుకుంటుండగా భట్టిప్రోలు సొసైటీకి మాత్రం ఎలాంటి గోడౌన్ సౌకర్యం లేక అవసరమైనప్పుడు పక్కనే ఉన్న మార్కెట్ యార్డ్ గోడౌన్‌లు వినియోగించుకోవాలిసి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో అద్దేపల్లిలో ఉన్న సొంత గోడౌన్ స్థానంలో మరో నూతన గోడౌన్ నిర్మిస్తే పిఎసిఎస్‌కు గోడౌన్ సమస్య తీరినట్లవుతుంది.
వైసిపి నాయకుల కనుసన్నల్లో గోడౌన్ తొలగింపు
వ్యవసాయ పరపతి సంఘానికి సంబంధించి అద్దేపల్లి గోడౌన్ తొలగింపు పనులు స్థానిక అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరగటం విశేషం. శిథిలావస్థకు చేరిన ఈ గోడౌన్‌ను తొలగిస్తున్న అంశం సొసైటీ పాలకవర్గానికి తెలిసినట్లు కూడా లేదు. గోడౌన్ తొలగింపునకు ముందుగా సొసైటీలో తీర్మానం చేసి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఉన్నతాధికారులుకు అనుమతి కోసం నివేదించాలి. తదనంతరం తొలగింపునకు ఎంత ఖర్చు అవుతుంది అనేది అంచనా రూపొందించి తగిన నిధులు కేటాయించి శిథిలావస్థలో ఉన్న గోడౌన్‌ను తొలగించాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్న తొలగింపు పనులకు ఎలాంటి అంచనాలు, అనుమతులు లేకుండానే పనులు జరగటం, అది కూడా సొసైటీకి సంబంధించిన సిబ్బంది, పాలకవర్గం లేకుండా అధికార పార్టీ నాయకులు దగ్గరుండి పనులు జరిపించటం పలు అనుమానాలకు తావిస్తోంది. 60 ఏళ్ల క్రితం దిక్కుమొక్కు లేకుండా ఖాళీగా ఉన్న ఈ స్థలంలో ఆనాటి పాలకులు రైతుల అవసరాల రీత్యా గోడౌన్ నిర్మించారు. అప్పటి నుంచి ఈ స్థలం సొసైటీ ఆధీనంలో ఉండిపోయింది. ప్రస్తుతం తొలగిస్తున్న గోడౌన్ స్థలంలో మరో గోడౌన్ నిర్మాణం చేపట్టటంలో జాప్యం జరిగితే ఈ స్థలం కబ్జాదారుల చేతిలో బలయ్యే ప్రమాదం ఉందని, అలాంటి స్థితికి రాకముందు సొసైటీ పాలకవర్గం, సంబంధిత అధికారులు చొరవ చూపి స్థలాన్ని పరిరక్షించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై సొసైటీ సిఇఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ సొసైటీకి గోడౌన్ అవసరత ఉన్నందున తొలగిస్తున్న గోడౌన్ స్థానంలో నూతన గోడౌన్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.










