Aug 14,2023 21:27

విజయవాడలోని సిఆర్‌డిఎ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న రాజధాని పారిశుధ్య కార్మికులు

ప్రజాశక్తి - తుళ్లూరు : తమ ఖాతాల్లో పెండింగ్‌ పిఎఫ్‌ నిధులను సత్వరమే జమ చేయాలని రాజధాని పారిశుధ్య కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్‌ సందర్భంగా విజయవాడ సిఆర్‌డిఎ అధికారుల వద్దకు 'సామూహిక పిఎఫ్‌ కోసం రాయబారం' నిర్వహించారు. తొలుత సిఆర్‌డిఎ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేశారు. వీరికి మద్దతుగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ కార్మికుల సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు సిఐటియు అండగా ఉంటుందన్నారు. సిఐటియు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ ఏ నెల పిఎఫ్‌ ఆ నెల సరిగా జమ అయితేనే ప్రమోజనం ఉంటుందని, ఏజెన్సీల నిర్లక్ష్యం వల్ల పిఎఫ్‌ సరిగా జమవ్వక కార్మికులు పొందాల్సిన ప్రయోజనాలు దక్కడం లేదని చెప్పారు. రాజధాని ఏరియా పారిశుధ్య కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు ఎం.రవి మాట్లాడుతూ గతంలో రాజధాని గ్రామాల్లో శానిటేషన్‌ విధుల బాధ్యతను తీసుకున్న మూడు ఏజెన్సీల నిర్లక్ష్యం వల్ల 18 నెలల పాటు కార్మికుల ఖాతాలలో పిఎఫ్‌ జమ కాలేదని, కార్మికుల జీతాల నుండి ప్రతినెలా పిఎఫ్‌ పేరుతో ఏజెన్సీ వారు కట్‌ చేసి కార్మికుల ఖాతాల్లో మాత్రం జమ చేయలేదని తెలిపారు. సిఆర్‌డిఎ అధికారులు స్పందించి ఏజెన్సీల నిర్లక్ష్యం వల్ల నిలిచిన పిఎఫ్‌ను కార్మికుల ఖాతాల్లో జమ చేయించాలని కోరారు. అనంతరం సిఆర్‌డిఎ అడిషనల్‌ కమిషనర్‌ కట్టా సింహాచలానికి వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కారానికి ఆయన హామీనిచ్చారు. పని సరిగా చేయని ఏజెన్సీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం వల్ల పిఎఫ్‌ జమ ఆలస్యమైనట్లు చెప్పారు. కార్యక్రమంలో సిఐటియు రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.భాగ్యరాజు, సిఐటియు నాయకులు ఆర్‌.వేణు ,రాజధాని ఏరియా పారిశుధ్య కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్‌.సుశీల, కె.గోపిరాజు, సంఘం నాయకులు వీరాంజనేయులు, ఎ.జోజి, సుఖవేణి, కోటేశ్వరరావు, వై.జ్యోతి, పి.రత్నకుమారి, సిహెచ్‌ సుజాత, అచ్చి లక్ష్మి, కుచేలరావ్‌, గురవయ్య, టి.ఆదిలక్ష్మి, కోటేశ్వరి, నాగమణి, వెంకటేష్‌ పాల్గొన్నారు.