Aug 03,2021 20:34

కాన్పూర్‌ : పిఎంకేర్స్‌ ఫండ్‌ ద్వారా అందించిన పనిచేయని వెంటిలేటర్ల గురించి మాట్లాడిన డాక్టర్‌ నేహా అగర్వాల్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని గణేష్‌ శంకర్‌ విద్యార్థి మెమోరియల్‌ మెడికల్‌ కాలేజ్‌ (జిఎస్‌విఎం) ఆసుపత్రిలోని పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (పిఐసియు)కు నేహా అగర్వాల్‌ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. జులై మొదటి వారంలో టుబర్‌కులోసిస్‌తో బాధపడుతున్న చిన్నారికి వినియోగిస్తున్న వెంటిలేటర్‌ పనిచేయకపోవడంతో వైద్యులు మరో వెంటిలేటర్‌పైకి మార్చారు. ఆ చిన్నారి నాలుగు రోజుల తర్వాత మరణించాడు. ఈ ఘటన తర్వాత డాక్టర్‌ అగర్వాల్‌ హెఓడికి లేఖ రాశారు. పిఎంకేర్స్‌ ఫండ్‌ కింద ఆక్వా హెల్త్‌కేర్‌ కంపెనీ ద్వారా సరిగా పనిచేయని రెండు వెంటిలేటర్లు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. దీని గురించి హెఓడి యశ్వంత్‌ రావ్‌ జులై 6న ప్రిన్సిపాల్‌ ఆర్‌బి.కమల్‌కు ఒక లేఖ రాశారు. టూబర్‌కులోస్‌ మెనింగ్టిస్‌తో బాధపడుతున్న ఒక చిన్నారి మరణానికి పనిచేయని వెంటిలేటర్‌ కారణమైందని, మరో కంపెనీ వెంటిలేటర్లు ఇవ్వాలని కోరారు. పనిచేయని వెంటిలేటర్ల వ్యవహారంపై ఇప్పటి వరకు ఎటువంటి దర్యాప్తు చేపట్టని ప్రభుత్వం.. చిన్నారి మరణానికి డాక్టర్‌ అగర్వాల్‌ను బాధ్యురాలిని చేస్తూ సస్పెండ్‌ చేశారని మెడికల్‌ కాలేజ్‌ వర్గాలు తెలిపాయి.