ప్రజాశక్తి - ఏలూరు
జిల్లాలో పిఎంఇజిపి కింద లబ్ధిదారులకు ఎలాంటి జాప్యమూ లేకుండా త్వరితగతిన బ్యాంకర్లు రుణాలందించేలా చర్యలు తీసుకోవాలని ఎల్‌డిఎంను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షతవహించిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, పిఎంఇజిపి కింది లబ్ధిదారులకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు జాప్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రుణ మంజూరుకు నిర్ధేశించిన సమయానికన్నా ఎక్కువ రోజులు తీసుకుంటున్న బ్యాంకర్లను గుర్తించి వారితో శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఎల్‌డిఎంను ఆదేశించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో పిఎంఇజిపితో పాటు సిసిఆర్‌సి కార్డులు కలిగిన కౌలు రైతులకు రుణాలందించే విషయంపై కూడా బ్యాంకర్లతో సమీక్షిస్తామని కలెక్టర్ చెప్పారు. ప్రతీ గ్రామ పంచాయతీలో యువకేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు వృత్తినైపుణ్యం తదితర అంశాలపై శిక్షణ అందించేందుకు ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలకు చెందిన అర్హులైన యువతను పంచాయతీ కార్యదర్శుల ద్వారా గుర్తించే ప్రక్రియను వెంటనే పూర్తిచేసి నివేదికను అందజేయాలని డిపిఒను కలెక్టర్ ఆదేశించారు. ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఇండిస్టీయల్ పార్కు ఏర్పాటుకు అవసరమైన భూమి వివరాలను 15 రోజుల్లో సమర్పించాలని ద్వారకాతిరుమల తహశీల్దారును ఆదేశించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అవగాహన కల్పించేందుకు పారిశ్రామిక పాలసీ, వాటిమార్గదర్శకాలను, ప్రోత్సాహకాలను తహశీల్దారు, ఎంపిడిఓ కార్యాలయాల్లో పోస్టర్లు, కరపత్రాలను అందుబాటులో ఉంచాలని పరిశ్రమల కేంద్రం జిఎంను కలెక్టర్ ఆదేశించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ కింద వివిధ పరిశ్రమల ఏర్పాటుకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 129 దరఖాస్తులు రాగా వాటిలో 149 ఆమోదంపొందాయని మరో ఏడు నిర్ధిష్ట కాలపరిమితి పరిశీలనలో ఉన్నాయన్నారు. జగనన్న బడుగు వికాసం కింద పెట్టుబడి రాయితీ, వడ్డీ రాయితీ, విద్యుత్ రాయితీ, సేల్స్ టాక్స్ రాయితీ, స్టాంప్ డ్యూటీ రియింబర్స్‌మెంట్, ల్యాండ్ కన్వర్షన్ రియింబర్స్‌మెంట్ కింద రూ.54.25 లక్షల రాయితీ సొమ్మును ఎనిమిది మంది ఎంఎస్‌ఎంఇ పారిశ్రామికవేత్తలకు మంజూరుచేస్తూ సమావేశం ఆమోదించింది. ఈ సమావేశంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీపూజ, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం పి.ఏసుదాసు, దళిత ఇండిస్టీయల్ అసోసియేషన్ సభ్యులు సిర్రా భరత్, ఎపిఐఐసి జెడ్‌ఎం.బాబ్జీ, ఎపిఇపిడిసిఎల్ ఎస్‌ఇ సాల్మన్ రాజు, డిపిఒ టి.విశ్వనాథ్ శ్రీనివాస్, ఎల్‌డిఎం నీలాద్రి, డిటిసి శ్రీహరి, మత్స్యశాఖ ఇన్‌ఛార్జి జెడి జివివి.సత్యనారాయణ, కాలుష్యనియంత్రణ మండలి ఇఇ వెంకటేశ్వరరావు, సోషల్ వెల్ఫేర్ జెడి జయప్రకాష్ పాల్గొన్నారు.










