Sep 01,2023 22:46

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. హస్తకళలను చేతివృత్తిగా ఉన్న కుటుంబ వారసత్వంగా వృత్తిలో కొనసాగుతున్న వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. అర్హత గల లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుందన్నారు. దరఖాస్తు చేసుకున్న సంఘాలకు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు రుణం పొందేందుకు వీలు కల్పించినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, సిఎస్‌సిలు ప్రజలకు అవగాహన కల్పించి ఎక్కువ మందికి రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులు ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. రిజిస్ట్రేషన్‌ తర్వాత శిక్షణ ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి ఐడి కార్డు, సర్టిఫికెట్‌ ద్వారా గుర్తింపు రానుందని, వ్యాపారాభివృద్ధికి రుణాలు పొందేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజర్‌ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ రిజిస్ట్రేషన్‌కు కుటుంబంలో ఒక్కరు మాత్రమే అర్హులన్నారు. 18 ఏళ్ల పైబడిన వయసు కలిగి, వంశపారంపర్యంగా కుటుంబ వృత్తిగా చేస్తున్న హస్తకళాకారులు ప్రధానమంత్రి విశ్వకర్మ కింద నమోదు చేసుకోవచ్చన్నారు. లబ్ధిదారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్రెడిట్‌ ఆధారిత పథకాల ద్వారా రుణం పొందని వారు మాత్రమే అర్హులని వివరించారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లయితే పథకం పొందేందుకు వీలుండదన్నారు. రూ.500 ఇన్సెంటివ్‌ చెల్లిస్తూ 15 రోజుల పాటు శిక్షణ ఇస్తారని తెలిపారు. వడ్రంగి, పడవల తయారి, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరి, శిల్పకారులు, చర్మకారులు, చెప్పులు కుట్టే వారు, తాపీ పనిచేసేవారు, బుట్ట, చాప, చీపుర్లు నేసేవారు, బొమ్మల తయారీదారులు, క్షురకులు, రజకులు, బట్టలు కుట్టే వారు, చేపల వల తయారీదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. అవకాశాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌, ఎల్‌డిఎం సూర్యకిరణ్‌, పరిశ్రమల శాఖ ఎడిలు రమణారావు, రఘునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.