
జిల్లా కలెక్టర్ ప్రశాంతి
ప్రజాశక్తి - భీమవరం
పిఎం విశ్వకర్మ యోజన ద్వారా 18 రకాల చేతివృత్తులవారు ప్రయోజనం పొందాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ కుల వృత్తిదారులు, హస్త కళాకారుల వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. వడ్రంగి, పడవల తయారీ, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరి, శిల్పకారులు, చర్మకారులు, చెప్పులు కుట్టేవారు, తాపీపని చేసేవారు, బుట్ట, చాప చీపుర్లు చేసేవారు, బొమ్మల తయారీదారులు, క్షురకులు, రజకులు, దర్జీలు, చేపల వల తయారీదారులు ఈ పథకానికి అర్హులని తెలిపారు. ఈ పథకం కింద వృత్తిదారులకు వారు చేసే పనిలో నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా 5 నుండి 7 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారికి 15 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ సమయంలో రోజుకు రూ.500 చొప్పున స్టైఫండ్ కూడా అందజేయనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తయిన అనంతరం రూ.15 వేల విలువైన టూల్ కిట్టు అందజేస్తామని తెలిపారు. తక్కువ వడ్డీకి రుణాలను అందజేస్తామని తెలిపారు. వివిధ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఈ పథకం ద్వారా గొప్ప ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లోని సాంప్రదాయ కుల, హస్త కళాకారులకు, నైపుణ్యాభివృద్ధికి ఆర్థిక సహాయం అందించడం, మార్కెట్ అనుసంధానం చేయడం, సామాజిక భద్రత అందించడం ఈ పథకం లక్ష్యమని వివరించారు. ఇందుకోసం సాంప్రదాయ వృత్తిదారుల వ్యాపారాలను బలోపేతం చేసేందుకు 2023-2028 వరకూ ఐదేళ్లపాటు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయనుందని తెలిపారు. సాంప్రదాయ హస్త కళా నైపుణ్యాల పెంపునకు ఆర్థిక సహాయం అందించడం కోసం కేంద్రం విశ్వకర్మ యోజన పథకం తీసుకొచ్చిందని తెలిపారు. చేతివృత్తులు చేసుకునేవారు, హస్తకళల నిపుణులు రూపొందిం చే వస్తువుల, సేవల నాణ్యతను మెరుగుపర్చి దేశీయంగా, విదేశీ వ్యాపారులతో స్థానిక ఉత్పత్తి దారులు ముడిపడేటట్టు చేయ డమే ఈ పథకం ముఖ్యోద్దేశమని తెలిపారు. చేతివృత్తిదారులు కామన్ సర్వీస్ సెంటర్లు, మీసేవ, సచివాలయాల ద్వారా ఆధార్‌కార్డుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పేర్కొన్నారు. రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు ఇస్తామని తెలిపారు. చేతివృత్తుల పనివారికి శిక్షణ ఇచ్చి అవసరమైన వస్తు సామగ్రి కొనుగోలు నిమిత్తం 18 వాయిదాల్లో తిరిగి చెల్లించే విధంగా ఐదు శాతం వడ్డీతో తొలిదశగా రూ.లక్ష వరకూ బ్యాంకుల ద్వారా రుణం ఇవ్వనున్నట్లు తెలిపారు. రుణం సక్రమంగా చెల్లించే వారికి వ్యాపారాభివృద్ధికి తర్వాత దశల్లో రూ.2 లక్షలు, రూ.3 లక్షలు రుణం మంజూరు చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి పిఎం విశ్వకర్మ యోజనను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. పథకం ప్రారంభం నాటికి లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. చేతివృత్తుదారులు వారి అమ్మకాలను డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా చేసినట్లయితే ప్రతిరోజూ 100 ట్రాన్సాక్షన్‌కు లిమిట్ చేసి వంద రూపాయలు అదనంగా వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాన్ని చేతివృ త్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.