Oct 05,2021 06:30

పి.ఎం కేర్స్‌ నిధిని ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు? దీని ద్వారా లబ్ధి పొందేవారెవరు? సహాయం అందక ఎదురు చూస్తున్న వారెవరు? పని తీరు లోని రహస్యం, ముఖ్యంగా దాని కేటాయింపులకు సంబంధించిన అస్పష్టత కారణంగా పి.ఎం కేర్స్‌ మీద అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది భారత ప్రభుత్వ ఆధీనంలో, ప్రధానమంత్రి హామీ ఉంటుందనే ఉద్దేశంతో మిలియన్ల సంఖ్యలో భారతీయులు, విదేశీయులు భారీగా విరాళాలు సమకూర్చారు. నెలలు గడుస్తున్న కొద్దీ దీనికి సంబంధించి దాఖలవుతున్న అఫిడవిట్ల సంఖ్య పెరుగుతుండడంతో, ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వేతర సంస్థగా కనిపిస్తున్నది.

     పి.ఎం కేర్స్‌ నిధిని ఏర్పాటు చేసిన 18 నెలల్లో దాని యాజమాన్యం గురించి, దానిపై అదుపు, దాని నిర్వహణ గురించి సమాధానాల కంటే ప్రశ్నలే చాలా ఎక్కువగా వస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటి వరకు వసూలైన మొత్తం, పంపిణీ అయిన మొత్తాల గురించి ఏవిధమైన స్పష్టత లేదు. 'అసలు ఈ నిధులు భారతదేశ ప్రధానమంత్రికి సంబంధించినవా లేక దానికి బాధ్యుడైన నరేంద్ర మోడీకి సంబంధించినవా?' సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ఆ ప్రశ్నలకు ఏ రకమైన సమాధానాలు రాలేదు.
     పరస్పర విరుద్ధమైన (అధికార, అనధికార) ప్రకటనలను కొట్టిపారేయలేం. 'పి.ఎం కేర్స్‌ నిధి పబ్లిక్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు సంబంధించిన నిధి. ఇది ప్రభుత్వానికి లేదా రాష్ట్రానికి సంబంధించిన నిధి కాద'ని...ప్రధాని కార్యాలయానికి చెందిన దిగువ కార్యదర్శి స్థాయి అధికారి సంతకంతో ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ఒక అఫిడవిట్‌ ఉద్ఘాటించింది. వసూలైన మొత్తం 'కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఇండియా' (సీఎఫ్‌ఐ)లో కనిపించదని కూడా అఫిడవిట్‌ లో తెలిపింది. పి.ఎం కేర్స్‌ నిధిని ప్రభుత్వాధీనం లోకి తీసుకొని రావాలని, లేదా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను (పిఐఎల్‌) సుప్రీంకోర్టుకు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌, వివిధ కోర్టులకు హాజరైన ఇతర న్యాయాధికారులు వ్యతిరేకించారు. ఆర్టీఐ, సమాచారం ఇవ్వడానికి నిరాకరించినందువలన పిటీషన్‌దారులు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
     అఫిడవిట్లు దాఖలయి, వివిధ పత్రికల్లో వార్తా కథనాలు రావడంతో పి.ఎం కేర్స్‌ నిధి ప్రధాని కార్యాలయం నుంచి తరలివెళ్లింది. మన జాతీయ కోశాగారం నుండి వేతనాలు పొందుతున్న ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు పి.ఎం కేర్స్‌ కు వారి ''గౌరవ'' సేవలందించారు. రాజ్యాంగబద్ధమైన పదవిని నిర్వహిస్తున్న మన ప్రధానమంత్రి ఆ నిధి ట్రస్ట్‌ బోర్డుకు చైర్మన్‌. ఆ నిధి వెబ్‌సైట్‌ లో ఉన్న వివరాల ప్రకారం, మన ప్రధానమంత్రి దాని సృష్టికర్తగా, మంత్రివర్గం లోని కేబినెట్‌ మంత్రులు ట్రస్ట్‌ సభ్యులుగా ఉంటారు. ఆ వెబ్‌సైట్‌ అధికారికంగా భారత ప్రభుత్వ పోర్టల్‌గా, భారత ప్రభుత్వ చిహ్నంతో ఉంది.
     నిధికి సంబంధించిన ప్రతీ వివరం, నిధిని అధికారికంగా ఏర్పాటు చేసినట్లు సూచిస్తున్నాయి. కానీ అది ఒక పబ్లిక్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌గా ప్రారంభమైనట్లు చెప్తున్నారు. దానికి, ప్రభుత్వం లేదా సీఎఫ్‌ఐతో ఎటువంటి సంబంధం లేదని దాని నిర్వాహకులు కోర్టులో చెప్పారు. ఇది భారత ప్రధానమంత్రి నిధికి తక్కువగానూ, నరేంద్రమోడీ నిధికి ఎక్కువగానూ ఉన్నపుడు దీనిలో ఎవరి జోక్యం ఉండాలి? అసలు ఇది ఎవరికి సంబంధించిన నిధి? మాయగాళ్ళు, మోసకారులు తాము అనుసరించిన మార్గం విజయం సాధించినందుకు గర్వపడుతున్నారు.
     పి.ఎం కేర్స్‌ నిధి మార్చి 27న ప్రారంభమైన తరువాత, ''దయచేసి ఈ నిధికి అందరూ సహాయం అందించాల''ని తోటి భారతీయులను కోరినట్లు మోడీ ట్వీట్‌ చేశారు. ఆ తరువాత మూడు రోజులకు అంటే 2019-20 ఆర్థిక సంవత్సరాంతానికి 3076 కోట్ల రూపాయల నిధి వసూలు అయింది. భయంకరమైన కరోనా మహమ్మారి తీవ్రమై, కఠినమైన లాక్‌డౌన్‌ విధించిన సమయంలో, కేవలం ఆరు వారాల్లో భారీగా రూ.10,600 కోట్లకు నిధి వసూళ్లు పెరిగాయి.
     ప్రభుత్వ రంగ కంపెనీలు, ప్రైవేట్‌ కంపెనీలు, వ్యక్తులు కలిసి ఆ నిధులను సమకూర్చారు. ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వంలో పని చేసే ఉద్యోగులు ఒకరోజు వేతనాన్ని ఆ నిధికి విరాళంగా అందించారు. భారతదేశ ప్రజలు, ప్రధానమంత్రి నిధికి సహాయం అందిస్తున్నామనే భావనతో విరాళాలు అందించారు. విదేశీ విరాళాలు అనుమతించబడ్డాయి. కంపెనీలు వాటి 'కార్పొరేట్‌ సామాజిక బాధ్యత' కేటాయింపులను కూడా ఆ నిధికే మళ్ళించాయి.
     పద్దెనిమిది నెలల పాటు కోవిడ్‌-19తో పోరాడిన తరువాత, తమ జీవితాలపై ఆర్థిక, ఆరోగ్య ప్రభావాల నుంచి కొంత ఉపశమనాన్ని కలిగించే ఉద్దేశంతో ఏర్పాటైన ఈ నిధి గురించి భారతీయులకు కొంత సమాచారం ఉంది. ప్రభుత్వం ఈ నిధిని ఏర్పాటు చేసిన మూడు నాలుగు రోజుల తరువాత, మిలియన్ల సంఖ్యలో అసంఘటిత రంగ కార్మికులు లాక్‌డౌన్‌ కారణంగా వారి కుటుంబాలతో పట్టణ, నగర ప్రాంతాల నుండి సొంత గ్రామాలకు కాలినడకన భారీగా వలసలు మొదలుపెట్టారు. ఆ ప్రయాణంలో కనీసం వంద మంది తమ ప్రాణాలను కోల్పోయారు. స్వాతంత్య్ర భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఉన్న మానవ సంక్షోభాన్ని నివారించేందుకు, పి.ఎం కేర్స్‌ నిధి ద్వారా కాక, పౌర సమాజంలోని సంస్థలు ప్రజల విరాళాలతో భారీ సహాయ చర్యలకు పూనుకున్నాయి.
    పి.ఎం కేర్స్‌ కు సహాయాన్ని ఎలా అందించాలనే వివరాలను మాత్రమే తన వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. కానీ, 1948లో ప్రారంభమైన ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పి.ఎం.ఎన్‌.ఆర్‌.ఎఫ్‌) వలె కాకుండా, పి.ఎం కేర్స్‌ ఎవరి నుండి ఎంత విరాళం అందింది, ఎవరికి ఎంత కేటాయించారనే సమాచారం ప్రధానమంత్రి కార్యాలయం ఇవ్వదు. పి.ఎం.ఎన్‌.ఆర్‌.ఎఫ్‌ గత పది సంవత్సరాలకు (2010-11 నుండి 2019-20) సంబంధించిన జమా ఖర్చుల పట్టికను తన వెబ్‌సైట్లో ఉంచుతుంది. కానీ పి.ఎం కేర్స్‌కు సంబంధించిన ఇలాంటి సమాచారం అందుబాటులో ఉంచకుండా కేవలం మార్చి 31, 2020 నాటికి ఆడిట్‌ చేసిన లెక్కల వివరాలు మాత్రమే వెబ్‌సైట్‌లో ఉంచడం జరిగింది.
     గడచిన సంవత్సరంలో తీవ్రమైన విమర్శలు చేసిన తర్వాత, ప్రధానమంత్రి కార్యాలయం ఈ నిధిని ఏర్పాటు చేయడంలోని ఉద్దేశాలను ఒక ప్రకటనలో తెలిపింది. రూ. 3100 కోట్లకు గాను సుమారు రూ.2 వేల కోట్లను వెంటిలేటర్ల కొనుగోలుకు కేటాయిస్తామని, రూ. వెయ్యి కోట్లను వలస కార్మికుల బాగోగుల కోసం వినియోగిస్తామని (వసతుల ఏర్పాటుకు, ఆహారం సమకూర్చడానికి, వైద్య సౌకర్యాలు మరియు వారి స్వస్థలాలకు పంపడానికి అవసరమైన రవాణా ఏర్పాట్ల కోసం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయిస్తామని), వంద కోట్లు వ్యాక్సిన్‌ ఉత్పత్తి క్రమం కోసం వెచ్చిస్తామని ఆ ప్రకటనలో తెలిపారు. ''మేకిన్‌ ఇండియా'' పాలసీ కింద 50 వేల వెంటిలేటర్లను తయారు చేసి, రాష్ట్రాలకు పంపిణీ చెయ్యాల్సి వచ్చిందని తెలిపింది.
      పి.ఎం కేర్స్‌ నిధి పంపిణీ అనుకున్న ప్రకారం జరిగిందా లేదా అన్నది నిష్పాక్షికంగా ఆడిట్‌ జరిగిన తరువాత మాత్రమే తెలుస్తుంది. ఈ నిధిని, ఒక స్వతంత్ర సంస్థ అయిన 'భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌' ఆడిట్‌ చేయకుండా బిజెపి నాయకులతో సంబంధాలు కలిగి ఉన్న ఒక ప్రైవేట్‌ సంస్థ చేత ఆడిట్‌ చేయించారు. అయినా నిధులు ఎక్కువగా ఖర్చైన 2020-21 సంవత్సరానికి సంబంధించిన ఆడిట్‌ రిపోర్ట్‌ ఇప్పటికీ అందుబాటులో ఉంచలేదు. వాస్తవానికి ట్రస్ట్‌ దస్తావేజులు, డిసెంబర్‌ 2020లో అంటే పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించిన తొమ్మిది నెలల తర్వాత మాత్రమే బహిరంగ పర్చారు. పి.ఎం కేర్స్‌ నిధిని ఒక 'చీకటి కొట్టు' అని పేర్కొంటూ, ప్రతిపక్షాలు ఈ సమస్యను లోక్‌సభ దృష్టికి తెచ్చాయి. కానీ పాలక బిజెపి...ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిని, గాంధీలను ఎత్తిచూపుతూ సమస్యను పక్కదారి పట్టించింది.
     కాబట్టి, భారత ప్రజానీకం ఈ ఏడాది ఆరంభంలో కరోనా మహమ్మారితో పోరాటం చేసిన సమయంలో, ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత ఏర్పడింది. రెమ్‌డెసివిర్‌ లాంటి మందుల ధరలు విపరీతంగా పెరిగాయి. అప్పుడు కూడా పి.ఎం కేర్స్‌ నిధులను సమకూర్చలేదు. ఈ మహమ్మారికి గురైన భారతీయులు అనేక మంది పేదరికంలోకి నెట్టబడ్డారు. కానీ అటువంటి కుటుంబాలకు పి.ఎం కేర్స్‌ చేయూతనిచ్చిందని చెప్పుకున్న సందర్భాలు ఒక్కటి కూడా లేదు. కోవిడ్‌-19 సోకి కోలుకోలేక మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ ఈ పని చెయ్యాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు. దేశంలో లక్షా ఇరవై వేల మంది పిల్లలు కోవిడ్‌ కారణంగా అనాథలుగా మారారని ఒక అధ్యయనం అంచనా వేసింది. కానీ ఆ అనాథ పిల్లల ఆలనా పాలనతో పాటు వారికి 18 సంవత్సరాలు వచ్చేంతవరకు వారి చదువులకయ్యే ఖర్చును భరిస్తుందని పి.ఎం కేర్స్‌ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.
     పి.ఎం కేర్స్‌ నిధిని ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు? దీని ద్వారా లబ్ధి పొందేవారెవరు? సహాయం అందక ఎదురు చూస్తున్న వారెవరు? దాని పని తీరు లోని రహస్యం, ముఖ్యంగా దాని కేటాయింపులకు సంబంధించిన అస్పష్టత కారణంగా పి.ఎం కేర్స్‌ మీద అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది భారత ప్రభుత్వ ఆధీనంలో, ప్రధానమంత్రి హామీ ఉంటుందనే ఉద్దేశంతో మిలియన్ల సంఖ్యలో భారతీయులు, విదేశీయులు భారీగా విరాళాలు సమకూర్చారు. నెలలు గడుస్తున్న కొద్దీ దీనికి సంబంధించి దాఖలవుతున్న అఫిడవిట్ల సంఖ్య పెరుగుతుండడంతో, ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వేతర సంస్థగా కనిపిస్తున్నది. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ప్రధాని నేతృత్వంలో నడిచే ట్రస్ట్‌ మోసపూరితమైనదనే అనుమానం ప్రజలలో కలుగుతున్నది.

/ వ్యాసకర్త ముంబైలో సీనియర్‌ జర్నలిస్టు, రచయిత /
( 'న్యూస్‌ క్లిక్‌' సౌజన్యంతో )
స్మృతీ కొప్పికర్‌

పి.ఎం కేర్స్‌ నిధులకు యజమాని ఎవరు ?