జిల్లాలో 88,952 ఇళ్లు మంజూరు
12,665 మాత్రమే పూర్తి
బిలో బేస్‌మెంట్ లెవెల్‌లో 52 వేల ఇళ్లుపైనే
ఎప్పటికి పూర్తయ్యేనో అర్థంకాని పరిస్థితి
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
ప్రధానమంత్రి అవాసయోజన పథకంలో మంజూరైన ఇళ్లనిర్మాణం జిల్లాలో ఎప్పటికి పూర్తవుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. 2022 నాటికి ఇళ్లు పూర్తిచేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. సొంత ఇళ్లులేని వారు, కచ్చా ఇళ్లు, తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్లు కలిగిన వారు ఈ పథకానికి అర్హులుగా కేంద్రం పేర్కొంది. కానీ 2022 పూర్తవుతున్నా మంజూరైన ఇళ్లకు సంబంధించి జిల్లాలో ఒకటోవంతు కూడా పూర్తికాలేదు. అర్హుల జాబితా తయారు చేయడం ఆలస్యం కారణంగా గడిచిన రెండునెలల క్రితమే నిధులు విడుదలైనట్లు తెలుస్తోంది. పిఎం అవాస యోజన గ్రామీణ పథకంలో ఇళ్లకు రూ.లక్షా 80 వేలు ఆర్థిక సాయం లబ్ధిదారులకు అందుతోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.72వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.78 వేలు, ఉపాధి హామీ పథకం నుంచి రూ.30వేలు లబ్ధిదారునికి అందేవిధంగా ఈ పథకం రూపొందించారు. అర్బన్ ప్రాంతాల్లో నిధులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాల్లో కొంత వ్యత్యాసం ఉంది. జిల్లాకు వేలాది ఇళ్లు మంజూరైనప్పటికీ ఇళ్ల నిర్మాణం మాత్రం మందకొడిగా సాగుతోంది. పిఎం ఆవాస యోజన కింద ఏలూరు జిల్లాలోని పట్ణణ, గ్రామీణ ప్రాంతాల్లో 88,952 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు మంజూరైన ఇళ్లు 25,098 ఉన్నాయి. అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో పూర్తయిన ఇళ్లు ఇప్పటి వరకూ కేవలం 12,665 మాత్రమే. ఏలూరు జిల్లాకు మొత్తం 88,952 ఇళ్లు మంజూరుకాగా ఇప్పటి వరకూ గ్రౌండ్ అయినవి 84,352 ఉన్నాయి. రిజిష్టర్ కానివి ఇంకా 4,600 వరకూ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ లెక్కల ప్రకారం పునాదులు కూడా దాటనవి 52,741కాగా, పునాదుల దశలో 10,030 ఇళ్లు ఉన్నాయి. రూఫ్ లెవిల్‌లో 3,353, రూఫ్ లెవల్ దాటినవి 5,563, పూర్తయిన ఇళ్లు 12,665 మాత్రమే. ఈ పథకంలో ఇళ్ల నిర్మాణాలు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతంలో ఇళ్లనిర్మాణానికి ఇప్పటి వరకూ చేసిన ఖర్చు రూ.12చ కోట్లు మాత్రమే.
ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతోనే ఆలస్యం..!
నవరత్నాల పథకంలో అందరికీ ఇళ్లు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా దృష్టిసారించిన పరిస్థితి ఉందని, పిఎం ఆవాస యోజన ఇళ్లనిర్మాణాలపై పెద్దగా దృష్టిసారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఇళ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అదే క్రమంలో కేంద్రం నుంచి నిధుల మంజూరు ఆలస్యం కారణంగా ఇళ్ల నిర్మాణం ముందుకు సాగలేదన్నట్లు చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ పథకంలో నిర్మిస్తున్న ఇళ్లన్నీ దాదాపు లబ్ధిదారుల సొంత స్థలాల్లోనే జరుగుతున్నాయి. ఇళ్లనిర్మాణం మందకొడిగా సాగుతుండటంతో లబ్దిదారుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ పథకంలో మంజూరైన ఇళ్లనిర్మాణంపై ప్రభుత్వం దృష్టిసారించాలని అంతా కోరుతున్నారు. గృహనిర్మాణ అధికారులు ఇటు నవరత్నాల్లో భాగంగా జరుగుతున్న పేదలంరికీ ఇళ్ల నిర్మాణం, ఇటు పిఎం అవాసయోజన ఇళ్లనిర్మాణ పర్యవేక్షణలో భారంగా మారుతోంది. పిఎం అవాస యోజన పథకంలో చేపట్టిన ఇళ్లనిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయో ఇప్పటికైనా నిర్ధిష్ట గడువు పెట్టుకుని ముందుకుసాగితే లబ్ధిదారులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది.










