కడప : పర్మినెంట్ లోక్ అదాలత్ (పిఎల్‌ఎ) ద్వారా ఫిర్యాదుదారులు ఎలాంటి కోర్టు ఖర్చులు లేకుండా సత్వర న్యాయ పరిష్కారం అవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.శ్రీనివాస ఆంజనేయ మూర్తి పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాసదన్ భవనంలో 'శాశ్వత లోక్ అదాలత్' ఆధ్వర్యంలో ప్రజా ప్రాయోజిత సేవా రంగాల్లో న్యాయ సేవలపై సంబందిత జిల్లా అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధులుగా జిల్లా ప్రధాన జడ్జితో పాటు పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఎస్. ప్రసాద్, జిల్లా అడిషనల్ సబార్డినేట్ జడ్జి ఎం.ప్రదీప్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ 'పర్మనెంట్ లోక్ అదాలత్' వ్యవస్థను ఇద్దరు వ్యక్తుల మద్య వివాదం కలిగివున్న వారందరికి ఎలాంటి కోర్టు ఖర్చులు లేకుండా సత్వర న్యాయ పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారన్నారు. కడప జిల్లా కోర్టు ఆవరణంలో ఉన్న ఈ వ్యవస్థ రాష్ట్ర హైకోర్టు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక చట్టానికి లోబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వంచే ఏర్పాటు చేశారన్నారు.ఈ పర్మినెంట్ లోక్ అదాలత్ అందించే తీర్పు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో సమానమని తెలిపారు. ఈ తీర్పుకు ఎలాంటి అప్పీలు లేదని, దీని ద్వారా 10 రకాలైన ప్రజా ప్రయోజిత సేవా రంగాలకు సంబంధించిన సేవలలో ఎలాంటి అవాంతరాలు, లోపాల వల్ల జరిగే నష్టాలకు సంబంధించి త్వరితగతిన న్యాయ పరిష్కారం పొందవచ్చన్నారు. మరిన్ని పూర్తి వివరాలకు జిల్లా కోర్టు ఆవరణలోని పర్మనెంట్ లోక్ అదాలత్ కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు. అనంతరం పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్, డిఎల్‌ఎస్‌ఎ సెక్రెటరీ మాట్లాడుతూ ప్రజా ప్రాయోజిత సేవల్లో లోపం, పరిహారం కోసం దావా, సొమ్ము వసూలు, పర్మనెంట్ లోక్ అదాలత్, ప్రజా ప్రయోజిత సేవలలో లోపాలతో కలుగు నష్టాలపై వచ్చే ఫిర్యాదులకు సంబందిత ప్రజా ప్రాయోజిత శాఖల అధికారులు ఎలా స్పందించాలి.. తదితర అనేక అంశాలపై సంబందిత జిల్లా అధికారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ మీనా, డ్వామా పీడి యదుభూషన్ రెడ్డి, ప్రజా ప్రాయోజిత సేవా రంగాలకు చెందిన సంబందిత అధికారులు పాల్గొన్నారు.










