
ప్రజాశక్తి - మేడికొండూరు : పిడుగుపాటుతో ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం పాలైన ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం మందపాడులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దొడ్డ సువార్త (45), బిల్లా ప్రభావతి (22) మరో 10 మంది కలిసి ఉదయం 10 గంటల తర్వాత మిర్చి నాటు కోసం వెళ్లారు. 11 గంటల నుండి వర్షం మొదలైంది. వర్షంలోనే పనులు కొనసాగించారు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత పిడుగు పడడంతో సువార్త, ప్రభావతి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన పోలీ సులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మృతురాలు సువార్తకు కుమారుడు, కుమార్తె కాగా, మరో మృతురాలు ప్రభావతికి మూణ్ణెల్ల కిందటే వివాహమైంది. వీరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబాలను తహశీల్దార్ శ్రీనివాస్‌శర్మ పరామర్శించి, ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయం అందించారు.