ప్రజాశక్తి - ప్రత్తిపాడు:పిడుగుపడి ఇద్దరు రైతుతోపాటు అతనికి సాయంగా వెళ్లిన మరోకరు మృత్యువాత పడ్డారు. మండలంలోని పాతమల్లాయపాలెంలో జరిగిన ఘటనపై వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాట్ల శ్యామ్‌బాబు (47) పదెకరాల్లో మిర్చి సాగు చేశాడు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఉన్నట్టుండి వాతావరణం చల్లబడ్డంతో వర్ష సూచనను గమనించిన శ్యామ్‌బాబు తన భార్య సువర్ణ, కుమారుడు ప్రకాష్‌కుమార్, తమ్ముడు ప్రసాద్, తమ్ముని కుమారుడు ప్రకాష్, స్నేహితులు కొరివి కృపానందం (57), నీలం పిచ్చయ్యనూ వెంటబెట్టుకుని తన పొలం వద్దకు పురుగున వెళ్లారు. ఏడెకరాల మిర్చి పంట కళ్లంలో ఉండడంతో దానిపై పట్టాలు కప్పడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. శ్యామ్‌బాబు, కృపానందం ఒకవైపు పట్టను సరిచేస్తుండగా మిగతావారు మిగతా వైపు ఉన్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి పిడుగు పడడంతో శ్యామ్‌బాబు, కృపానందం అక్కడే కుప్పకూలారు. సువర్ణ, ప్రసాద్ కూడా షాక్‌తో పడిపోయారు. అయితే కొద్దిసేపటికి ఇద్దరూ తేరుకోగా శ్యామ్‌బాబు, కృపానందం లేవలేదు. దీంతో హుటాహుటిన వారిని ఓ కారులో ప్రత్తిపాడులోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే వారు మృతి చెందినట్లు సిబ్బంది నిర్థారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్)కు తరలించారు. మృతుడు శ్యామ్‌బాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా కృపానందానికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.










