ప్రజాశక్తి - మక్కువ : మండలంలోని దబ్బగెడ్డ పంచాయతీ పరిధిలో విజయరామపురం సమీపాన ఆదివారం మధ్యాహ్నం పిడుగుపాటుకు 9 మేకలు, రెండు గొర్రెలు మృతి చెందాయి. మండలంలోని కోన గ్రామానికి చెందిన యాసై గంగయ్య, వెంకటరమణ తదితరులు గొర్రెలు కాపర్లు మేత కోసం గొర్రెలను తీసుకువెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం పడింది. ఇదే సందర్భంలో చలిపిడుగు కూడా పడడంతో ఒక్కసారిగా మేకల మంద వణికిపోతూ ఒకదాని తర్వాత మరొకటి ఇలా వరుసగా 11 మేకలు గొర్రెలు, మృతి చెందాయి. దూరం నుంచి గమనించిన మేకలు కాపర్లు దగ్గరకు వచ్చి చూసేసరికి మొత్తం చనిపోయాయి. దీంతో స్థానిక వెటర్నరీ అసిస్టెంట్ ఎం.రమేష్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పశుసంవర్ధకశాఖ ఉద్యోగి ఉన్నతాధికారులు సమాచారం అందించారు. మేకలకు ఎటువంటి బీమా లేదని ధ్రువీకరించారు. దీంతో రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రకృతి తమను కోలుకోలేని దెబ్బతీసిందని గొర్రెల కాపరులు వినిపిస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.










