Jun 20,2023 00:15

చనిపోయిన మేకలను పరిశీలిస్తున్న సర్పంచ్‌, ఎంపిటిసి, పశు వైద్య సిబ్బంది

ప్రజాశక్తి-సబ్బవరం
మండలంలోని అంతకాపల్లి పంచాయతీ శివారు రావలమ్మ పాలెంలో సోమవారం తెల్లవారుజామున భారీ పిడుగుపాటుకు 18 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో ఆరు మేకలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. బాధితుని కథనం ప్రకారం... కె.కోటపాడు మండలానికి చెందిన సబ్బి రమణ రావలమ్మ పాలెం బీసీ హాస్టల్‌ వెనుక నివాసం ఉంటూ మేకలు మేపుకుంటున్నాడు. సోమవారం వేకువ జామున కురిసిన అకాల వర్షంతో పిడుగుపాటుకు పాకలో ఉన్న 25 మేకల్లో 18 మృతి చెందగా మరో ఆరు మేకలు కొన ఊపిరితో ఉన్నాయి. దీంతో మేకలు యజమాని రమణ నిరాశ్రయులయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్‌ సబ్బవరపు నారాయణమూర్తి, ఎంపీటీసీ చొక్కాకుల గోవింద బాధితుడు రమణను పరామర్శించారు.
యాదవ సంఘం అధ్యక్షుడు రూ.10వేలు ఆర్థిక సాయం
ఈ విషయం తెలుసుకున్న అనకాపల్లి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు బర్ణికాన సాయినాధరావు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడు రమణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణమే రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు. రమణ కుటుంబాన్ని ఓదార్చి, పిల్లల చదువులకు ఏదైనా అవసరమైతే ఫోన్‌ చేయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు పల్లా తాతారావు, కోన సోమేశ్వరరావు, కోరాడ శ్రీనివాసరావు, పల్లా కృష్ణ, పల్లా రమణ, పల్లా వెంకటరమణ పాల్గొన్నారు.