Aug 25,2023 22:24

రామస్వామి నాయుడు (ఫైల్‌)

ప్రజాశక్తి - రణస్థలం రూరల్‌: పిడుగుపాటుకు గురై మండలంలోని వేల్పురాయికి చెందిన మహంతి రామస్వామి (63) శుక్రవారం మృతి చెందాడు. రామస్వామి రోజూలానే పొలం పనుల్లో నిమగమయ్యాడు. కూలీలతో వరి ఉడిపిస్తుండగా భారీ వర్షం గర్జనలతో కురిసింది. సాగుకు ఈ వర్షం తోడైందనే సంతోషం ఆ మోములో విరిసీ విరిస్తుండగానే పిడుగు పడడంతో పొలంలోనే కుప్పకూలిపోయాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య కాంతమ్మ, కుమారుడు రమణ, కుమార్తెలు రామలక్ష్మి, మంగమ్మ ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో కుంటుంబసభ్యులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. జె.ఆర్‌ పురం పోలీసులు కేసు నమోదు చేశారు.