
మరోసారి ఉక్కు పిడికిలి బిగిసింది. 2014 రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు హామీ ప్రధానమైంది. అప్పటి యుపిఎ, ఎన్‌డిఎలు సంయుక్తంగా రాష్ట్రాన్ని విభజించడం అందరికీ తెలిసిందే. తీవ్రంగా నష్టపోయిన ఆంధ్ర రాష్ట్ర్రంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ తొమ్మిదిన్నరేళ్లుగా నీరోడుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన ప్రధాన హామీల్లో ఏఒక్కటినీ అమలు చేయలేదు. దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో రాయలసీమ ముందజంలో ఉంది. ఇటువంటి ప్రాంత అభివృద్ధి పట్ల కేంద్రంలోని బిజెపి సర్కారు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ తాజాగా కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడం మాతోనే సాధ్యమనే పేరుతో బస్సుయాత్రకు శ్రీకారం చుట్టింది. తెలుగు రాష్ట్రాల మధ్య సమన్యాయం చేయకుండా కాంగ్రెస్ వివక్షను పాటించింది. కాంగ్రెస్ చేసిన తప్పిదానికి విభజిత రాష్ట్రప్రజానీకం తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాదుకునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూవస్తోంది. గతంలో చేసిన తప్పిదాలను సరిదిద్దుకునేందుకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు హామీని మరోసారి తెర మీదికి తీసుకొచ్చింది. 2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం తొమ్మిదిన్నరేళ్లుగా రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాల్ని చేపట్టిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో యుపిఎ, ఎన్‌డిఎ సంకీర్ణ సర్కార్లు సంయుక్తంగా ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసిన పాపాన పోలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల సమరం సమీపించిన నేపథ్యంలో మరోసారి ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరుతూ యాత్రల పేరుతో ముందుకు వచ్చింది. గతంలో సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కడప ఉక్కు బహిరంగసభలో పాల్గొన్న సమయంలో ప్రతిపక్ష పార్టీ హోదాలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో నిలదీసిన ప్రయత్నం చేసి ఉంటే ప్రయోజనం ఉండేది. ఎన్‌డిఎలోని బిజెపి ప్రభుత్వం ఫీజుబులిటీ లేదనే పేరుతో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని నాటకాలు ఆడుతుండడం తెలిసిందే. కడపలో ఐరన్‌ఓర్, డోలమైట్, సున్నపురాయి, ఇతర ముడి ఖనిజ వనరులు పుష్కలముగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటువంటి ప్రాంతంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడం సాధ్యం గాకపోవడ మేమిటి, ఎటువంటి ముడి ఖనిజాలు లేని ముంబరు, బెంగళూరు, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఉక్కు పరిశ్రమలు ఎలా లాభసాటిగా నడుస్తున్నాయో తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో బిజెపికి ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేకపోవడం వల్లే తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శ పెద్దఎత్తున వినిపిస్తోంది. ప్రస్తుత ప్రపం చార్థికానికి రియల్ రంగం ఊతమిస్తున్న నేపథ్యంలో ఉక్కు ఉత్పత్తుల వినియోగం రెట్టింపు అవసరమనే నివేదికలు ఘోషిస్తుండగా దేశంలోనే అంత్యంత వెనకబడిన ప్రాంతమైన రాయలసీమ ప్రజల జీవితాలతో కాంగ్రెస్, బిజెపి ఆడుకోవడం ఆందోళనకరం. ఏదేమైనా కేంద్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా సెయిల్ ఆధ్వర్యంలో జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు.
- ప్రజాశక్తి- కడప ప్రతినిధి