Mar 03,2023 00:00

పిడిఎఫ్‌ గెలుపు.. ఉత్తరాంధ్రకు మలుపు


ప్రజాశక్తి - యంత్రాంగం
పాడేరు : పిడిఎఫ్‌ గెలుపు.. ఉత్తరాంధ్రకు మలుపు వంటిదని, ఈ ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం శాసనమండలి వేదికగా కృషి చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ రంగు పులుముకోవడం శోచనీయమని ఆమె తెలిపారు. గురువారం పాడేరు, అరకులోయ ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ 250 సంఘాల మద్దతుతో పిడిఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. జిఒ 3 రద్దుతో విద్య, ఉద్యోగాల్లో ఏజెన్సీలోని గిరిజనులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. సబ్‌ప్లాన్‌ నిధుల మళ్లింపు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై తీవ్ర నిర్లక్ష్యం, గిరిజన హక్కులపై దాడి, గిరిజనుల భూములు, సహజ వనరులపై పెత్తనం, గిరిజన ఆశ్రమాల్లో సిబ్బంది కొరత, హెల్త్‌వాలంటీర్ల తొలగింపు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతోనే కాలయాపన వంటి చర్యలతో గిరిజనుల సంక్షేమం, మన్యప్రాంతాల అభివృద్ధిని ప్రభుత్వాలు నీరు గారుస్తున్నాయన్నారు. ఈసందర్భంగా పాడేరులోని పలు కార్యాలయాలు, పాఠశాలల్లో పట్టభద్రుల ఓటర్లను కలిసి స్వయంగా ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఎపి గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స, మెడికల్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శెట్టి నాగరాజు యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి మహేష్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు హరీష్‌, స్థానిక గిరిజన సంఘం నాయకులు ఎల్‌ సుందరరావు, బొజ్జన్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు నరేష్‌ పాల్గొన్నారు.
ఉద్యమ అభ్యర్థులనే శాసనమండలికి పంపిద్దాం
హుకుంపేట: ఉద్యమ అభ్యర్థులనే శాసనమండలికి పంపించాల్సిన అవసరం ఉందని గిరిజన సంఘం, సిఐటియు నేతలు కోరారు. గురువారం మండలంలోని కస్తూర్బా, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, ఆంగ్ల మాధ్యమ బాలురు బాలికల పాఠశాలల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. గిరిజన సంఘం కార్యదర్శి టి.కృష్ణారావు, యుటిఎఫ్‌ జిల్లా నేత మహేష్‌, సిఐటియు మండల అధ్యక్షులు వి.లక్ష్మణరావు ,గిరిజన మహిళ సంఘం జిల్లా నేత ఎస్‌ హైమావతి పాల్గొన్నారు.
అరకులోయ రూరల్‌: మండలంలోని యండపల్లివలస గురుకుల బాలికల కళాశాల, పాఠశాల, అరకులోయ బాలుర గురుకులాల్లో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ కరపత్రాలను పంచుతూ విస్తృత ప్రచారం చేశారు. సిపిఎస్‌ రద్దు, జిఒ 3 పునరుద్ధరణ,గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక డిఎస్‌సి, భాషా, హెల్త్‌ వాలంటీర్ల రెన్యువల్‌, స్కీం వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సురేంద్ర, సిఐటియు జిల్లా కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పొద్దు బాలదేవ్‌, గిరిజన సంఘం మండల నాయకులు, రామారావు, భగత్‌ రామ్‌, ఐద్వా రాష్ట్ర నేత వివి.జయ పాల్గొన్నారు
రెండు బృందాలుగా గిరిజన సంఘం నేతల ప్రచారం
అనంతగిరి : ప్రజాసంఘాలు బలపరిచి, పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరుతూ గిరిజన సంఘం ఆధ్వర్యాన జెడ్‌పిటిసి దీసరి గంగరాజు, గిరిజన సంఘం నేత ఎం.కృష్ణ, సింగులు ఆధ్వర్యాన రెండు బృందాలు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో విసృత్తంగా ప్రచారం చేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ఎస్‌. నాగులు, జె. సుబ్బారావు, కె మొస్య. కార్యకర్తలు పాల్గొన్నారు.
పెదబయలు : కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరుతూ గిరిజనసంఘం ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం చేశారు. పాఠశాలలు, కార్యాలయాలతోపాటు ఉపాధి పనిప్రదేశంలో పట్టభద్రులైన ఓటర్లను కలిసి రమాప్రభను గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే అడుగులపుట్టు, సీతగుంట, లక్ష్మీపేట పంచాయతీల్లోనూ సచివాలయాలు, పాఠశాలలకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. కార్యక్రమంలో గిరిజనసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము పృథ్వీరాజ్‌, సంఘం పూర్వ అధ్యక్షుడు బోండా సన్నిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ నేత జంపరంగి సునీల్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
జి.మాడుగుల: మండలంలోని లువ్వాసింగి, కోరాపల్లి పంచాయతీల్లోని కోరాపల్లి, తగ్గిమెట్ట అరగడపల్లి లువ్వాసింగి తియ్యగుండం తదితర గ్రామాలలో కోరెడ్ల రమాప్రభ విజయాన్ని కాంక్షిస్తూ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సాగిన ధర్మన్నపడాల్‌, సిఐటియు మండల కార్యదర్శి జె.దీనబంధు గిరిజన మహిళ సంఘం మండల కన్వీనర్‌ అరగడ శ్రీలత విస్తృత ప్రచారం చేశారు.
ముంచింగిపుట్టు: పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరుతూ లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులను స్థానిక సర్పంచ్‌ కొర్ర త్రినాథ్‌ అభ్యర్థించారు. మండల కేంద్రంలో వైస్‌ఎంపిపి పాటుపోయి సత్యనారాయణ, సిపిఎం మండల కార్యదర్శి పాంగి భీమరాజు ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు గాసిరం దొర, లైకోన్‌ పాల్గొన్నారు.