ప్రజాశక్తి- మేదరమెట్ల: ఎమ్మెల్సీ ఎన్నికలలో పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర ఐద్వా మహిళ ప్రధాన కార్యదర్శి రమాదేవి పిలుపునిచ్చారు. మేదరమెట్లలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశలో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను అడ్డుకుంటోందని, ఇది సరైన పద్ధతి కాదని తెలిపారు. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల నేపత్యంలో విద్యాశాఖకు సంబంధించిన ప్రవీణ్ ప్రకాష్ వివిధ కారణాలతో పాఠశాలలను పర్యవేక్షిస్తూ వైసిపికి ఓటు వేయమని టీచర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు విమర్శించారు. పిడిఎఫ్ అభ్యర్థులు గెలుస్తారనే భయంతో వైసిపి ప్రభుత్వం ఉపాధ్యాయులపై, గ్రాడ్యుయేట్ ఓటర్లపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందిరిపై ఉందన్నారు. అనంతరం కోరిశపాడు మండలం మండల పరిషత్ ప్రజా పరిషత్ కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం ఆంజనేయులు మాట్లాడుతూ మండల పరిధిలోని 18 గ్రామాలలో పిడిఎఫ్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిడిఎఫ్ అభ్యర్థులకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు వీరాంజనేయులు, కెవిపిఎస్ మండల నాయకుడు కంచర్ల సురేష్ బాబు, చావా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










