ప్రజాశక్తి-చీరాల: ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం పోరాటం చేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్న పిడిఎఫ్ పట్టభద్రుల అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యాయ అభ్యర్థి పి బాబూరెడ్డిని గెలిపించాలని ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డి రమాదేవి కోరారు. చీరాల ఎన్జీవో భవన్లో ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్స్ పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోరుతూ సమావేశం నిర్వహించారు. ప్రధాన రాజకీయ పార్టీలు సైతం రాజకీయ నిరుద్యోగులను శాసనమండలిలోకి పంపి దోపిడీ విధానాలను కొనసాగించేందుకు పట్టభద్రులను సైతం మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గత మూడేళ్లుగా ఉద్యోగ ఉపాధ్యాయుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును పెంచి నిరుద్యోగులను మోసం చేశారని చెప్పారు. ఉద్యోగాల నియామకం ఏమీ లేకుండా ఆర్భాటంగా ప్రచారానికి పరిమితమైన జాబ్ క్యాలెండరున్ ప్రభుత్వం ప్రకటించి నిరుద్యోగులను భ్రమల్లోకి నెట్టింది అన్నారు. పిఆర్‌సి, డిఏలు ప్రశ్నించినందుకు, సకాలంలో వేతనాలు ఇవ్వాలని కోరినందుకు, ఎన్నికలకు ముందు పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ రద్దు చేయమన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులపై అరెస్టులు నిర్బంధాలు ప్రయోగించి దాడులకు పూనుకున్నదని గుర్తు చేశారు. ఇలాంటి ప్రజా సమస్యలను చట్టసభల్లో చర్చించేందుకు ఉద్యోగ ఉపాధ్యా య నిరుద్యోగుల వాణి వినిపించేందుకు పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సభకు యుటిఎఫ్ జిల్లా నాయకులు బండి భిక్షాలు అధ్యక్షత వహించారు. సభలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్రా రామారావు, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గౌరాబత్తిన సూరిబాబు, ఎఐటియుసి నాయకులు మేడా వెంకటరావు, రిటైర్డ్ ఎంఈఓ గాది హరిహరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా అంజయ్య, సిఐటియు బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ గంగయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎన్ బాబురావు, ఎం వసంతరావు, ఊటుకూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










